కొత్త రచ్చ: బాలినేని రష్యా టూర్.. చెవిరెడ్డి అమెరికా ట్రిప్!
అప్పటివరకు కడుపులో తల పెట్టి.. తన జీవితానికి అధినేతే దేవుడన్నట్లుగా బిల్డప్ ఇచ్చే నేత.. తెల్లారేసరికి ప్రత్యర్థి పార్టీ అధినేత కాళ్లకు నమస్కారం చేయటం కామన్.
By: Tupaki Desk | 26 Nov 2024 4:49 AM GMTరాజకీయంగా కొంతకాలం కలిసి ఉండి.. తర్వాత ఎవరి దారి వారు చూసుకోవటం కొత్తేం కాదు. అందుకే అంటారు మరే రంగంలో లేని విధంగా రాజకీయాల్లో శాశ్విత శత్రువులు. శాశ్విత మిత్రులు అన్నోళ్లు ఉండరని. అప్పటివరకు కడుపులో తల పెట్టి.. తన జీవితానికి అధినేతే దేవుడన్నట్లుగా బిల్డప్ ఇచ్చే నేత.. తెల్లారేసరికి ప్రత్యర్థి పార్టీ అధినేత కాళ్లకు నమస్కారం చేయటం కామన్. ఇలాంటి మార్పులు.. చేర్పులన్నీ కూడా కొత్త అవకాశాల కోసమే అవుతాయి. మరి.. ఈ తీరు మంచిదా? చెడ్డదా? అన్న చర్చ ఒక పట్టాన తేలేది కాదు.
సిద్దాంతాలు.. విలువలు పేరుతో నమ్ముకున్న పార్టీలోనే ఉండిపోయి.. అవకాశాలు చేజిక్కించుకోలేక.. ఎలాంటి పదవులు లేకుండా పోయిన నేతలు కోకొల్లలు. అదే టైంలో.. సమయానికి అనుగుణంగా స్పందిస్తూ.. తగిన రీతిలో నిర్ణయాలు తీసుకొని అందలానికి ఎక్కి.. అత్యున్నత పదవులు పొందిన నేతలు కనిపిస్తారు. అందుకే.. ఒక నేతకు సరైన అంశం.. మరో నేతకు కావొచ్చు. కాకపోవచ్చు. మొత్తంగా చెప్పేదేమంటే.. సమకాలీన రాజకీయాల్లో విలువలు.. సిద్ధాంతాలు అన్న అంశాల్ని ఇరుకు చట్రం నుంచి చూడటం తప్పే అవుతుంది. అయితే.. ఇక్కడో విషయాన్ని మిస్ కాకూడదు. రాజకీయ అవసరాలు.. పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారటం తప్పు లేదు.
కానీ.. పార్టీ మారే క్రమంలో కానీ.. మారిన తర్వాత కానీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడటమే తప్పు అవుతుంది. తమతో కుదరక.. పొసగక వెళ్లిపోయిన నేతను కెలకటం ద్వారా కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టుకోవటంలోనూ అర్థం లేదు. ఇప్పుడు వైసీపీకి చెందిన సీనియర్ నేత.. జగన్ కు వీర విధేయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాంటి తప్పే చేస్తున్నారు. ఒకప్పుడు తమ అధినేతకు వీర విధేయుడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయటం.. తాను అనే రెండు మాటలకు.. తిరిగి నాలుగు మాటలు అనిపించుకునే వైనం చూసినప్పుడు.. చెవిరెడ్డి ఆగ్రహం పార్టీకి.. పార్టీ అధినేతకు చేటు చేస్తుందని చెప్పక తప్పదు.
తాజాగా అదానీ ఎపిసోడ్ లో మాజీ మంత్రి బాలినేని బయటకు రావటం.. తనను అర్థరాత్రి నిద్ర లేపి ఫైల్ మీద సంతకం పెట్టమంటే సందేహం వచ్చి పెట్టలేదని.. తర్వాతి రోజు మంత్రివర్గంలో ఆమోద ముద్ర వేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ అంశం మీద చెవిరెడ్డి కావొచ్చు.. ఇంకొకరు ఎన్ని మాటలు అయినా అనొచ్చు. రాజకీయంగా బాలినేని మీద మరిన్ని ఆరోపణలు చేయటం తప్పు కాదు. ఎందుకుంటే వైసీపీ నుంచి వెళ్లిపోయిన బాలినేనిని ఏ మాటా అనకూడదని చెప్పట్లేదు. కాకుంటే.. ప్రైవేటు విమానంలో బాలినేని రష్యాకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన చెవిరెడ్డి.. అది నీకు స్వేచ్ఛ కాదా? అంటూ పోలిక తేవటంతోనే పంచాయితీ.
జగన్ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదని తాను అంటే.. అందుకు కౌంటర్ గా చెవిరెడ్డి.. తాను ప్రైవేటు విమానంలో రష్యాకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించటాన్ని తప్పు పడుతున్నారు. తన మిత్రులతో కలిసి ప్రైవేటు జెట్ లో రష్యాకు వెళ్లటం మంత్రిగా స్వేచ్ఛ అవుతుందా? అంటూ ప్రశ్నించిన బాలినేని.. ఈ సందర్భంగా చెవిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఎన్నిసార్లు అమెరికాకు ఆయన వెళ్లలేదు. అక్కడ ఆయనేం చేసేవారో బయటపెట్టమంటారా?’ అంటూ ప్రశ్నించారు. దీంతో.. బాలినేని రష్యా టూర్.. చెవిరెడ్డి అమెరికా ట్రిప్ లు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీశాయి. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి.. పార్టీ అధినేత వైపు వేలు చూపేలా మారాయి. నిజానికి.. రాజకీయ నేతలు.. అందునా ఒక స్థాయికి వెళ్లిన తర్వాత పబ్లిక్ లైఫ్ కు.. ప్రైవేటు లైఫ్ కు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. ఈ విషయాన్ని వదిలేసి చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనకే నష్టం తప్పించి.. బాలినేనికి కాదన్న విషయాన్ని త్వరగా గుర్తిస్తే మంచిది.