వైసీపీకి బిగ్ షాక్.. ఈసారి సమీప బంధువు నుంచే
బయటి నాయకులు వెళ్లిపోతే పర్వాలేదు.. ఈసారి వైసీపీ అధినేత జగన్ కు సమీప బంధువైన నాయకుడే జలక్ ఇచ్చారు.
By: Tupaki Desk | 18 Sep 2024 12:03 PM GMTఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి ఒక్కొక్కరుగా నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇంకొందరు గుడ్ బై కొట్టే ఆలోచనలో ఉన్నారు. వరుసగా ఒక్కో జిల్లా నుంచి కీలక నేతలు జారుకుంటున్నారు. బయటి నాయకులు వెళ్లిపోతే పర్వాలేదు.. ఈసారి వైసీపీ అధినేత జగన్ కు సమీప బంధువైన నాయకుడే జలక్ ఇచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది బిగ్ షాక్. దీన్నుంచి తేరుకోవడం ఆ పార్టీకి సవాల్ అనడంలో సందేహం లేదు.
‘ప్రకాశించి’.. దూరమై..
వైసీపీకి ఏపీలోకి ప్రకాశం జిల్లాలో పెద్ద దిక్కు బాలినేని శ్రీనివాసరెడ్డి. వైఎస్ జగన్ కు మామ వరుస అవుతారు. జగన్ తల్లి విజయమ్మకు మరిది అయిన వైవీ సుబ్బారెడ్డి సోదరిని బాలినేని శ్రీనివాసరెడ్డి వివాహం చేసుకున్నారు. అంటే.. వైవీ-బాలినేని బావా-బావమరుదులు. అయితే, కొన్నాళ్లుగా పార్టీలో ఇమడలేకపోతున్నారు బాలినేని. ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డితోనే ఆయనకు తీవ్ర విభేదాలు ఉన్నాయంటారు. గత ఎన్నికల సమయంలోనే ఇవి బయటపడ్డాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన ప్రకాశం వైసీపీని ఒక్కటిగా నడపడం ఆ పార్టీ అధిష్ఠానానికి సాధ్యం కాలేదు. దీంతోనే మధ్యేమార్గంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. కాగా, బాలినేని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే కాంగ్రెస్ లో ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించారు. అప్పటికి ఆ జిల్లా కాంగ్రెస్ కీలక నాయకుల హవా తగ్గడంత బాలినేనికి వైఎస్ పెద్దపీట వేశారు. 2009లో రెండోసారి గెలిచిన సమయంలో ఆయనకు కీలక మంత్రి పదవిని కేటాయించారు. ఇక వైఎస్ మరణం అనంతరం బాలినేని జగన్ వెంట నడిచారు.
వైవీ రాకతో పొడచూపిన విభేదాలు
వైఎస్ హయాంలో బాలినేని ప్రాకాశం జిల్లాలో చక్రం తిప్పగా.. జగన్ హయాంలో ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి హవా మొదలైంది. జగన్ చాన్నాళ్లు ఇద్దరినీ సమన్వయం చేశారు. అయితే, ఇది ఎంతోకాలం కొనసాగలేదు. ఇటీవల ఎన్నికల ముందునుంచే బాలినేని నిరసన స్వరం పెంచారు. ఆయనను అప్పటికి సముదాయించారు. ఇక ఎన్నికల్లో పార్టీ ఓటమితో బాలినేని తన దారి తాను చూసుకున్నారు. బుధవారం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు అందులో తెలిపారు.
చేరేది జనసేనలోనేనా..?
వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని చేరేది జనసేనలోనే అని అంటున్నారు. గతంలోనూ బాలినేనిపై ఇదే విధమైన ఊహాగానాలు వచ్చాయి. అంతేకాక జన సేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే బాలినేనికి కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేని అడుగులు జనసేన వైపేనని అంటున్నారు. గురువారం పవన్ కల్యాణ్ ను కలవనున్నట్లు బాలినేని తెలిపారు. మరి ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అధికారం కోల్పోయిన వైసీపీకి మొత్తమ్మీద ఒక్కొక్క నాయకుడు దూరం అతున్నారు. ఏపీలోని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సహా మరికొందరు నేతలపై జంపింగ్ కథనాలు వస్తున్నాయి. ఆయన నిర్ణయం ఏమిటో చూడాలి.