Begin typing your search above and press return to search.

ఇప్పుడు అసెంబ్లీలో బూతులు వినాల్సి వస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 6:43 AM GMT
ఇప్పుడు అసెంబ్లీలో బూతులు వినాల్సి వస్తోంది: వైసీపీ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!
X

ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అసెంబ్లీలో ఉన్నప్పుడు చతురోక్తులు వినపడేవని.. ఇప్పుడు అసెంబ్లీలో బూతులు వినాల్సి వస్తోందన్నారు. కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఒంగోలు శ్రీబాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని ఆయన సొంత ఖర్చుతో నిర్మించారు.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొణిజేటి రోశయ్య తనకు పితృసమానుడని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను గనుల శాఖ మంత్రిగా ఉన్నానన్నారు. ఈ క్రమంలో ఓబుళాపురం మైన్స్‌ అధినేత గాలి జనార్దన్‌ రెడ్డికి మైన్స్‌ కేటాయించవద్దని కాంగ్రెస్‌ హైకమాండ్‌ రోశయ్యను ఆదేశించిందని తెలిపారు. అయితే ఈ లోపే అధికారులు ఆయనకు, తనకు తెలియకుండా గనులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈ విషయం తెలిసి కాంగ్రెస్‌ హైకమాండ్‌ రోశయ్యపై సీరియస్‌ అయ్యిందని వెల్లడించారు. ఆ సమయంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న తనను కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏమీ అనకుండా రోశయ్య అంతా చూసుకున్నారన్నారు.

రోశయ్యతో తన అనుబంధం మరువలేనిదన్నారు. ఆయనలేని అసెంబ్లీని ఊహించలేకపోతున్నానని వెల్లడించారు. నాడు చమత్కారంతో ప్రతిపక్షాలకు సమాధానం చెబుతూ యువ శాసనసభ్యులకు రోశయ్య స్ఫూర్తిగా నిలిచేవారని కొనియాడారు.

బియ్యపురెడ్డి అనే పేరున్న జనార్దన్‌ రెడ్డిని అనుకరిస్తూ శాసనసభలో ఆయన పెద్దగా మాట్లాడితే చెయ్యి కట్‌ చేస్తానంటూ హెచ్చరించిన దమ్మున్న ధైర్యశాలి రోశయ్యని బాలినేని గుర్తు చేశారు. శాసనసభలో ఆయన ఉన్నప్పుడు అప్పుడే సభ అయిపోయిందా అని అనిపించేదన్నారు.

మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రోశయ్యకు, తమ కుటుంబానికి ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అభివృద్ధి చెందాలని రోశయ్య కాంక్షించేవారన్నారు.

కాగా రోశయ్య ఉన్నప్పుడు అసెంబ్లీలో చతురోక్తులు వినేవాళ్లమని.. ఇప్పుడు బూతులు వినాల్సి వస్తోందంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.