Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చిన బాలినేని

ప్రకాశం జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తారన్న పేరున్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

By:  Tupaki Desk   |   16 July 2024 4:07 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చిన బాలినేని
X

ప్రకాశం జిల్లా రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తారన్న పేరున్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై ఫైర్ అయ్యారు. మాస్ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒంగోలు నుంచి హైదరాబాద్ కు వెళ్లిన ఆయన.. సోమవారం పట్టణానికి రావటం.. వచ్చినంతనే మీడియా భేటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మీద సంచలన ఆరోపణలు చేశారు.

తన వియ్యంకుడు నిర్మిస్తున్న విల్లాల్లోకి దౌర్జన్యంగా మనుషుల్ని పంపించారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన బాలినేని.. ‘‘మా వియ్యంకుడు నిర్మిస్తున్న విల్లాల్లోకి దౌర్జన్యంగా మనుషుల్ని పంపిస్తావా? చెప్పుతో కొడతా. ఏం చేతకానివాల్లం అనుకుంటున్నావా? తెగించామంటే ఎవడికీ అందదు. మర్యాదస్థుల కుటుంబంలో పుట్టినోళ్లం. ఈ రకంగా చేష్టలు చేస్తే ఊరుకోను. దమ్ముంటే నాతో రా. కార్యకర్తలతో కాదు. మా వియ్యంకుడు నిర్మిస్తున్న శ్రీకర విల్లాల్లో ఎలాంటి అక్రమాలు లేవు. అక్కడకు సుబ్బారావు గుప్తాను దౌర్జన్యంగా పంపి మా మీద ఆరోపణలు చేయిస్తున్నారు. ఇంకోసారి ఎవరైనా అక్కడకు వెళ్తే చెప్పుతో కొడతా’’ అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.ఈ సందర్భంగా నియంత్రణ కోల్పోయిన బాలినేని బూతులు లంకించుకోవటంతో విస్తుపోవటం విలేకరుల వంతైంది.

ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉందామని అనుకున్నానని.. కార్యకర్తలపై దాడులు చూసి తట్టుకోలేకే తిరిగి వచ్చినట్లుగా పేర్కొన్నారు.

తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పినా.. ఓటర్లు తనను ఎందుకు ఓడించారో అర్థం కాలేదన్న ఆవేదనను వ్యక్తం చేసిన బాలినేని.. తమ పార్టీకి చెందిన వారిలో కొందరు మోసం చేశారన్నారు. వారెవరో తనకు తెలుసన్న ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఓవైపు తమ పార్టీ నేతలు కొందరు మోసం చేశారని.. వారెవరో తనకు తెలుసన్న బాలినేని.. మరోవైపు ఓటర్లు తనను ఎందుకు ఓడించారో అర్థం కాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.

ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును అధినాయకత్వం పరిశీలిస్తుందన్న ప్రశ్నకు బాలినేని తీవ్రంగా రియాక్టు అయ్యారు. జిల్లా గొడ్డు పోలేదంటూ.. ‘‘ఈ జిల్లాలో నాయకులు లేరా? వారిలో సమర్థత లేదా?’’ అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు తన మీద.. తన కొడుకు మీదా హవాలా.. భూకబ్జాల ఆరోపణలు చేశారని.. ఇప్పుడు టడీపీనే అధికారంలో ఉంది కాబట్టి.. వాటిని రుజువు చేయాల్సిందిగా సవాలు విసిరారు.