Begin typing your search above and press return to search.

పార్టీ మార్పు మీద బాలినేని సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే టీడీపీ నేతలు వరసబెట్టి చేస్తున్న దాడుల మీద బాలినేని ఫైర్ అయ్యారు. ఈ దాడులు మంచి పద్ధతి కాదని అన్నారు.

By:  Tupaki Desk   |   15 July 2024 5:04 PM GMT
పార్టీ మార్పు మీద బాలినేని సంచలన వ్యాఖ్యలు
X

వైసీపీలో కీలక నేత అతి ముఖ్యుడు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఆయన కొన్ని అంశాల మీద క్లారిటీ కూడా ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు.

తాను జనసేనలోకి వెళ్తున్నాను అని ప్రచారం సాగడం పూర్తిగా తప్పు అని అవన్నీ ఉత్త ఊహాగానాలే అని కూడా బాలినేని క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీకి అనూహ్యమైన ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. వాటిని సమీక్షించుకుంటున్నామని చెప్పారు.

మరో వైపు చూస్తే ఒంగోలు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని స్థానికులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒంగోలు వైసీపీలో సమర్ధవంతమైన నాయకులు ఎంతో మంది ఉన్నారని వారిలో ఎవరికి ఇచ్చినా బాగా పనిచేస్తారు అని బాలినేని అంటున్నారు. ఈ పదవికి ఒంగోలు నుంచి ఇటీవల ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ఈ పదవి ఇస్తారని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో బాలినేని ఈ రకమైన డిమాండ్ చేశారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే టీడీపీ నేతలు వరసబెట్టి చేస్తున్న దాడుల మీద బాలినేని ఫైర్ అయ్యారు. ఈ దాడులు మంచి పద్ధతి కాదని అన్నారు. వైసీపీ గతంలో అధికారంలో ఉన్నపుడు తాము విపక్షాల మీద ఎలాంటి దాడులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. తాను అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అని ఏ రోజూ ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని ఆయన స్పష్టం చేశారు.

నిజానికి తాను రాజకీయాలు వద్దు అని ఒక దశలో అనుకున్నానని కానీ తమ పార్టీ క్యాడర్ మీద దాడులు చేస్తూ పోతూ ఉంటే మళ్లీ రాజకీయాల్లొకి వస్తాను అని చెప్పానని ఆయన అన్నారు. ఇక తాను అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలు అనేకమైన ఆరోపణలు చేశాయని వాటిని నిరూపించాలని బాలినేని డిమాండ్ చేసారు. వైసీపీ నేతలు టీడీపీలోకి మారగానే మంచివాళ్ళు అయిపోయారా అని బాలినేని ప్రశ్నించారు. మొత్తం మీద బాలినేని మీడియా ముందుకు వచ్చి చాలా అంశాల మీద క్లారిటీ ఇచ్చారు.