Begin typing your search above and press return to search.

జగన్ అంటే నాకొడుక్కి అంత ఇష్టం.. మీరు పని చేస్తానంటేనే పోటీ చేస్తా!

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుక్కి సీఎం జగన్ అంటే ఎంత ఇష్టమో చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 5:15 AM GMT
జగన్ అంటే నాకొడుక్కి అంత ఇష్టం.. మీరు పని చేస్తానంటేనే పోటీ చేస్తా!
X

ఓపెన్ గా మాట్లడే కొద్ది మంది ఏపీ నేతల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలియాస్ వాసు ఒకరు. ప్రతిపక్షానికి చెందిన వారు సైతం ఆయన్ను అభిమానిస్తుంటారు. విషయం ఏదైనా మనసులో దాచి పెట్టుకోకుండా ఓపెన్ గా మాట్లాడే తత్త్వం ఆయనకు ఎక్కువ. చాలా విషయాల్ని సెన్సార్ చేసి మాట్లాడే తీరుకు భిన్నంగా.. అవును ఇదే నిజమంటూ తన మనసును ఓపెన్ గా విప్పేస్తుంటారు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుక్కి సీఎం జగన్ అంటే ఎంత ఇష్టమో చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

"రాజకీయాల్లో చూశాను గత ముప్ఫై సంవత్సరాలుగా. ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యాను కానీ.. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇరిటేషన్ వస్తోంది రాజకీయాలంటే. ఉన్న వాస్తవం చెబుతున్నా. ఎందుకు ఇరిటేషన్ వస్తోందంటే.. లేనివి అన్నీ కూడా మాట్లాడటం.చెప్పటం చేస్తున్నారు. ఇవెంతగా ఉన్నాయంటే మీకో ఉదాహరణ చెబుతా. నా కొడుక్కి జగన్ అంటే ఎంత ఇష్టమంటే.. మొన్న నేను చూశా. తెలంగాణ ఎన్నికల్నిచూస్తే.. కాంగ్రెస్ వస్తుందని క్లియర్ గ తెలుస్తోంది. ఒకడు వచ్చి కాంగ్రెస్ రాదు.. బీఆర్ఎస్ వస్తుందన్నాడు. కాంగ్రెస్ వస్తుందని చెప్పా. కానీ.. అతడు యాభై సీట్లు కూడా రాదన్నాడు. సరే..యాబై సీట్లు రావంటున్నావుకదా.. రూ.50 లక్షలకు నేనే పందెం పెట్టా. ఇదంతా మా అబ్బాయికి తెలిసి నాన్న.. బీఆర్ఎస్ వస్తుంది నాన్న.. పందెం ఎందుకు పెడతావు అని అన్నాడు"

"నేను పందెం కాసిన తర్వాత నా కొడుకు ఖమ్మం.. నల్గొండ.. అదిలాబాద్.. నిజామాబాద్ జిల్లాలతో పాటు తెలంగాణలో చుట్టుపక్కల జిల్లాలు అన్నింటికి తరిగి వచ్చి.. బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ రావాలంటూ తపించాడు. అక్కడ బీఆర్ఎస్ వస్తే.. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వాడి నమ్మకం. అందరూ అదే అంటున్నారు. అక్కడ బీఆర్ఎస్ వస్తే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ వస్తుందని. అంత తపన పడ్డాడు"

"అదంతా చూసి.. నేను కాంగ్రెస్ పక్కన పందెం పెట్టటం ఏంటి? వీడు ఇలా ఫీల్ కావటం ఏంటని నేను పందెం నుంచి తప్పుకున్నా. నాకు తెలుసు.. నేను పందెంలో గెలుస్తానని.. యాభై లక్షలు వస్తాయని తెలుసు. కానీ.. క్యాన్సిల్ చేసేశా. అంటే.. వాడి మనసు బాధ పెట్టకూడదని. అప్పటికి 60 సీట్లు వస్తాయని పందెం ఉంది. డబ్బులు నాకు వస్తాయని క్లియర్ గా తెలిసినా.. వాడు బాధ పడకూడదని వదిలేశా. ఎంతకాడికి వాడు.. జగన్ రావాలి.. జగన్ రావాలని. ఆయనకు కూడా ఉండాలి కదా మా మీద. ఉండాలని కోరుకుంటున్నా"

"మరి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి తెద్దామా? వద్దా? అని ఆలోచించే పరిస్థితికి వచ్చింది. నిజంగా.. అస్సలు వాడికి ఏ మాత్రం సంబంధం లేని వాటి మీద బురద జల్లటం.. ఏందో మా ఫ్యామిలీకే ఇరిటేషన్ వేస్తా ఉంది. అదేమంటే.. వాసు చూడు.. బాధ పడుతుంటాడని అంటుంటారు. ప్రతిసారీ చెప్పలేను కానీ.. ఒకటైతే చెబుతున్నా. ఈసారి మీరందరు కోరుకుంటేనే పోటీ చేస్తా. నేనైతే ఎక్కడా తప్పు చేయను. మీ కోసమే పని చేస్తా. నా కోసమైతే పని చేసుకోను. మీరంతా హర్ట్ ఫుల్ గా పని చేస్తానంటేనే పోటీ చేస్తా"

"కొందరు గిద్దలూరు పోతాడంటారు. కొందరు పార్టీ మారతారంటారు. నాకివన్నీ పెద్ద ఇరిటేషన్ అయిపోయింది. మీ అందరి అండదండలు ఉంటేనే కచ్ఛితంగా ఒంగోలు నుంచే పోటీ చేస్తా. నా మనిషి వాసు అనుకొని పని చేస్తారన్న నమ్మకం మీరంతా నాకు ఇస్తేనే పని చేస్తా. లేదంటే.. పని చేయను. వాళ్లుఎలా అయితే వస్తారో.. మీరు కూడా మనస్ఫూర్తిగా రోడ్డు మీదకు వచ్చి.. పని చేసే బాధ్యత తీసుకుంటేనే పోటీ చేస్తా. లేదంటే పని చేయను. జగన్ కూడా చెప్పేశాను. నేనుచాలా నీతివంతుడ్ని.. నేను అస్సలు ఎక్కడా డబ్బులు తీసుకోలేదని చెప్పను. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి నేనెక్కడా తప్పు చేయలేదు. మంత్రిగా ఉన్నప్పుడు బయట ఎక్కడైనా ఇస్తే తీసుకున్నా. తీసుకోకుండా నేను రాజకీయం నడపలేను. ఉన్న వాస్తవం చెబుతున్నా. అబద్ధం చెప్పటం ఇష్టం లేదు. ఉన్న డబ్బు కంటే కూడా అప్పు చేసి రాజకీయం చేస్తున్నానే తప్ప.. మరింకేమీ లేదు. వెయ్యి కోట్లు సంపాదించాడా? అనే ఆలోచన ఉంది. పోయిన ఎలక్షన్ కు మా వియ్యంకుడు డబ్బులు పెట్టాడు. మీ కోసం పని చేశా. నా కోసం పని చేస్తానంటేనే నేను పోటీ చేస్తా. లేదంటే నిలబడను" అంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.