ప్రోటోకాల్ : రోడ్డెక్కిన రవాణా మంత్రి !
ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఈ సమయంలో బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ
By: Tupaki Desk | 9 July 2024 10:29 AM GMTఆషాడమాసం రావడంతో తెలంగాణలో బోనాల ఉత్సవాలు సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఈ సమయంలో బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చిన రవాణామంత్రి పొన్నం ప్రభాకర్ ను అధికారులు రిసీవ్ చేసుకోవడంలో ఆలస్యం కావడంతో ఆయన ఆగ్రహంతో రోడ్డు మీదనే బైఠాయించారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ వేడుకల నేపథ్యంలో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ సమర్పించారు. ఈ సంధర్భంగా అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదే సమయంలో పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అధికారులు మంత్రి పొన్నం, మేయర్ లను రిసీవ్ చేసుకోవటంలో ఆలస్యమయింది. అక్కడ స్వల్ప తోపులాట చోటు చేసుకోవటంతో మేయర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆలయ నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహంతో ఆలయం వద్దనే పొన్నం, మేయర్ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆలయ చైర్మన్, ఆలయ నిర్వాహకులు అక్కడకు చేరుకొని వారిని సముదాయించి లోపలికి తీసుకెళ్లారు.