బల్లి కల్యాణ చక్రవర్తి.. ఓ రాజకీయం.. మరో వివాదం..!
దీంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో బల్లి కల్యాణ చక్రవర్తి ఉన్నారన్నది వాస్తవం.
By: Tupaki Desk | 17 Nov 2024 2:30 AM GMTబల్లి కల్యాణ చక్రవర్తి. వైసీపీ తరఫున శాసన మండలి సభ్యుడిగా ఉన్న యువ నాయకుడు. అయితే.. ఈయన ఇప్పుడు సెంట్రాఫ్ డిబేట్ అయ్యారు. దీనికి కారణం.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగి చాలా రోజులే అయింది. అయితే..ఆయన చేసిన రాజీనామాను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇప్పటి వరకు ఆమోదించలేదు. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో బల్లి కల్యాణ చక్రవర్తి ఉన్నారన్నది వాస్తవం.
నిజానికి ఎమ్మెల్సీ చక్రవర్తి.. ఎమ్మెల్సీగా రాజీనామా చేసి.. ఆ వెంటనే జనసేనలోకి చేరాలన్నది ప్రయత్నం. దీనికి సంబంధించి అన్ని వ్యూహాలను ఆయన సిద్ధం చేసుకున్నారు. జనసేనలోకి చేరిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి టీడీపీలోకి వెళ్లాలని అనుకున్నా రు. తిరుపతి జిల్లాలో పార్టీ నాయకులు ఎక్కువగా ఉండడంతోపాటు పోటీ కూడా ఎక్కువగానే ఉంటోంది. దీంతో జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.
ఇదిలావుంటే.. తండ్రి దుర్గా ప్రసాద్ హఠాన్మరణంతో ఖాళీ అయిన తిరుపతిఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నా.. అప్పట్లో జగన్ అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఇచ్చి మండలికి పంపించారు. అయితే.. రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చాక.. టీడీపీ, జనసేనల వైపు కల్యాణచక్రవర్తి మొగ్గు చూపారు. ఇదిలావుంటే.. అసలు బల్లి చక్రవర్తికి ఉపశమనం కలగకుండా వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.
20 రోజుల కిందటే తన ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేసినా.. ఇప్పటి వరకు చైర్మన్ మోషేన్ రాజు ఓకే చెప్పలేదు. ఇప్పటికిప్పుడు రాజీనామాను ఆమోదించకుండా.. మరో మూడు నుంచి ఆరు మాసాల వరకు తొక్కి పెట్టేలా వైసీపీ చక్రం తిప్పుతోందన్నది చక్రవర్తి వర్గం చేస్తున్న ఆరోపణ. ఇదే జరిగితే.. ఆయన పార్టీ నుంచి దూరం అయ్యే పరిస్థితి ఉండదని కూడా లెక్కలు వేసుకుంది. కానీ, చక్రవర్తి మాత్రం ఎంత త్వరగా పార్టీ మారుదామా? అని చూస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన ఆశలు నెరవేరే పరిస్థితి అయితే కనిపించకపోవడం గమనార్హం.