పాక్ కు దిమ్మ తిరిగే ప్రకటన చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేయటం.. అందులోని ప్రయాణికుల్ని బందీలుగా తమ వద్ద ఉంచినట్లుగా వారు ప్రకటించటం తెలిసిందే.
By: Tupaki Desk | 14 March 2025 10:25 AM ISTకుట్రలు.. కుతంత్రాలు తప్పించి.. నేరుగా ఎదుర్కొనే దమ్ములేని దాయాది పాకిస్థాన్ కు తొలిసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సమస్య విరుచుకుపడింది. నిత్యం భారత్ మీద ఏడుపు.. ఏదో ఒక పాడుపనితో భారతీయుల్ని ఇబ్బందులకు గురి చేయాలన్న దుర్మార్గం ఇప్పుడా దేశానికి గుదిబండలా మారింది. ఉడుకుమోతుతనంతో తనను తాను నాశనం చేసుకున్న పాకిస్థాన్ కు తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కారణంగా ఎదురైన సవాలు ఒక ఎత్తు అయితే.. ఆ ఇష్యూను కవర్ చేసేందుకు చేసిన ప్రయత్నం మిస్ ఫైర్ కావటమే కాదు మొదటికే మోసం తెచ్చిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారిందని చెప్పాలి.
జాఫర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేయటం.. అందులోని ప్రయాణికుల్ని బందీలుగా తమ వద్ద ఉంచినట్లుగా వారు ప్రకటించటం తెలిసిందే. అయితే.. ఈ హైజాక్ విషయంలో సైన్యం రంగంలోకి దిగిందని.. వారిని మట్టుబెట్టి.. ఆపరేషన్ ను పూర్తి చేసినట్లుగా పాక్ సైన్యం చేసిన ప్రకటనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.
పాక్ సైన్యం పేర్కొన్నట్లుగా ఆపరేషన్ పూర్తి కాలేదని.. సైన్యంపై కాల్పులు కొనసాగుతున్నట్లుగా తాజాగా ప్రకటన చేసింది. దీంతో.. పాక్ సైన్యం ఇప్పటివరకు చెప్పిన మాటలన్ని గాలి మూటలన్న విషయం ప్రపంచానికి అర్థమైంది. తమ తాజా ప్రకటనతో పాక్ పరువును నిలువునా తీసేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. మరో కీలక వ్యాఖ్య చేసింది. తాము చేసిన దాడిలో పాక్ భద్రతా బలగాలకు భారీ నష్టం వాటిల్లినట్లుగా పేర్కొంది.
ఇప్పటికే పాక్ సైనికులు చాలామంది మరణించారని.. శత్రువులపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదంటూ.. తమ అధీనంలో చాలామంది ప్రయాణికులు ఉన్నట్లుగా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బీఎల్ఏ ఒక ప్రకటన చేసింది. మంగళవారం 440 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్కు వెళుతున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేయటం.. బంధీలుగా ప్రయాణికుల్ని తమ వద్ద ఉంచుకోవటం తెలిసిందే. ట్రైన్ ను హైజాక్ చేసినంతనే.. వారిని వేర్వేరు గ్రూపులుగా చేసి.. వేర్వేరు ప్రాంతాలకు తరలించిన వైనం పాక్ సైన్యానికి తలనొప్పిగా మారింది.
ఇదిలా ఉంటే 33 మంది మిలిటెంట్లను హతమార్చామని.. 21 మంది ప్రయాణికులు.. నలుగురుభద్రతా సిబ్బంది మరణించారని.. మిగిలిన ప్రయాణికుల్నిక్షేమంగా విడిపించినట్లుగా పాక్ సైన్యం వెల్లడించింది. అయితే.. పాక్ సైన్యం తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజల్నిమభ్య పెట్టాలని చూస్తున్నట్లుగా లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. యుద్ధ నియమాలు.. అంతర్జాతీయ నిబంధనల్నిపరిగణలోకి తీసుకొని రైల్లో ఉన్న కొందరు సైనికుల్ని తామే వదిలేశామని స్పష్టం చేసింది.
పాక్ సైన్యం తమ మీద పోరాటం చేయలేక..సామాన్య బలూచ్ పౌరుల్ని వేధిస్తున్నట్లుగా విమర్శించింది. జైళ్లలో ఉన్న తమ మిలిటెంట్లను వదిలి పెడితే రైల్లో ఉన్న మిగిలిన సైనికులు.. ప్రయాణికుల్ని విడిచి పెడతామని పేర్కొంది. తమ మాట వినకపోతే.. పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. బలూచిస్తాన్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్ని చూసేందుకు వచ్చే జర్నలిస్టులకు అనుమతి ఇవ్వాలని పాక్ ప్రభుత్వానికి సూచన చేసింది. అప్పుడు అసలు పరిస్థితులు ఏమిటో ప్రపంచానికి తెలిసే వీలుందని చెప్పింది. ఈ ప్రకటన పాక్ పరువు పోయేలా చేసిందని చెప్పక తప్పదు.