Begin typing your search above and press return to search.

పెద్ద కష్టమే : టికెట్ నై బండారూ...!

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ లేదు అని తేలిపోయింది. ఆయన టికెట్ ని తీసుకెళ్ళి జనసేనకు ఇస్తున్నారు

By:  Tupaki Desk   |   14 March 2024 11:38 AM GMT
పెద్ద కష్టమే : టికెట్ నై బండారూ...!
X

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి టికెట్ లేదు అని తేలిపోయింది. ఆయన టికెట్ ని తీసుకెళ్ళి జనసేనకు ఇస్తున్నారు. 2009లో అప్పటి సీనియర్ నేతగా మాజీ మంత్రిగా ఉన్న బండారు ని రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి ప్రజారాజ్యం తరఫున ఓడించిన పంచకర్ల రమేష్ బాబు ఈసారి బండారుని పోటీలోనే లేకుండా చేశారు అని ఆయన వర్గం మధన పడుతోంది.

బండారు కి టికెట్ లేదు అన్న వార్తలతో ఆయన అనుచరులు బండారు నివాసానికి చేరుకుని మరీ జై బండారూ అని నినాదాలు చేశారు. నై బండారు అని అధినాయకత్వం టికెట్ నిరాకరించింది. దాంతో ఈ సీనియర్ నేత రగిలిపోతున్నారు. ఏడు పదుల చేరువలో ఉన్న బండారు ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం మీద తన స్థాయి తగ్గించుకుని మరీ విమర్శలు చేశారు. ఒక దశలో బూతులు మాట్లాడుతూ అరెస్ట్ కూడా అయ్యారు.

ఇంత చేసినా అయనకు టికెట్ మాత్రం దక్కలేదు. ఈసారి తనకు టికెట్ ఖాయం అనుకుని బండారు భావించారు. ఎపుడో పాతికేళ్ల క్రితం ఒకసారి కొంత కాలం మాత్రమే చేసిన మంత్రి పదవి ముచ్చటను మరోసారి తీర్చుకుని సంతృప్తిగా రాజకీయాల నుంచి రిటైర్ కావాలని బండారు తలచారు. కానీ పొత్తుల రూపంలో ఆయన చిత్తు అయ్యారు.

మొదటి నుంచి పెందుర్తి సీటు జనసేనకు వెళ్తుందని అంతా భావించారు. అయితే బండారు వియ్యం అందుకున్న వారు తక్కువ వారు కాదు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు బండారుకు వరసకు వియ్యంకుడు. ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్వయాన అల్లుడు. దాంతో తన సీటు ఎక్కడికీ పోదు అని ఆయన అనుకున్నారు.

కానీ జరిగింది చూస్తే వేరుగా ఉంది. వైసీపీలో ఉన్న పంచకర్లను జనసేనలోకి రప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఆయనకు కోరుకున్న సీటుని ఇప్పించుకోగలిగారు. మొత్తానికి జనసేన టీడీపీ పొత్తుల వ్యూహాలతో పెద్దాయన బలి అయిపోయారు అని ఆయన అనుచరులు ఆక్రోశిస్తున్నారు.

ఇదిలా ఉంటే సీటు చిరిగిపోతుందని ముందే తెలిసిన బండారు కుమారుడు అప్పలనాయుడు ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ అర్ధం ఏమిటి అంటే అన్ని గుడ్లూ ఒక బాస్కెట్ లో పెట్టకూడదు అని. అంటే ఇపుడు ఇద్దరు ప్రధాన అభ్యర్ధులను ఒకే సీటు లో ఇరికించాలని చూడడం వల్ల బండారు కు సీటు అనే గుడ్డు పగిలిపోయింది అని అర్థం వచ్చేలా ట్వీటారు కానీ ఎన్నికల్ హీట్ మొదలైన తరువాత అంతా అన్నీ తేల్చుకున్నాక ఇపుడు సీటు గల్లంతు అయ్యాక తాపీగా ట్వీట్ వేసుకున్నా లాభం ఏమిటి అని అంటున్నారు.

ఇదిలా ఉంటే బండారు కి 1989 నుంచి టీడీపీ వరసబెట్టి టికెట్లు ఇస్తూ వస్తోంది. ఆయన అంతకు ముందు ఎంపీపీగా పనిచేశారు. 1998లో మంత్రి కూడా అయ్యారు. ఏకంగా ఏడు సార్లు బండారుకు టికెట్ ని టీడీపీ ఇస్తే ఆయన మూడు సార్లు ఓటమి పాలు నాలుగు సార్లు గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా చంద్రబాబు చాన్స్ ఇచ్చారు.

ఇపుడు ఆయన టీడీపీకి విధేయతగా ఉంటారా లేదా అన్నది చర్చగా ఉంది. ఆయన సైలెంట్ గా ఉంటే ఆయన కుమారుడి రాజకీయానికి అయినా ఎంతో కొంత హామీ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఆయన అల్లుడు వియ్యంకుడు ఇద్దరూ టీడీపీ అధినాయకత్వానికి దగ్గరి వారు కాబట్టి బండారుకు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ అయినా ఇప్పిస్తారు అని అంటున్నారు ఏది ఏమైనా భవిష్యత్తు హామీలు సంగతి పక్కన పెడితే ఉన్న సీటు పోయింది. ఇది ఖరారు అయింది. దాంతో బండారు తో పాటు ఆయన అనుచర వర్గం పూర్తిగా నిరాశలో ఉన్నారు అని అంటున్నారు.