Begin typing your search above and press return to search.

బండికి బీజేపీ పగ్గాలు...ఈటెలకు కేంద్ర మంత్రి ?

అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పోరేషన్ లోనూ అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 3:41 AM GMT
బండికి  బీజేపీ పగ్గాలు...ఈటెలకు కేంద్ర మంత్రి ?
X

తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం గట్టిదలగా ఉంది. దాంతో తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అన్న దాని మీద తీవ్రమైన కసరత్తు చేస్తోంది. తాజాగా చూస్తే కేంద్ర అధినాయకత్వం బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతోంది అని అంటున్నారు. ఆయన గతంలో మూడేళ్ళ పాటు ఈ కీలకమైన పదవిని నిర్వహించి పార్టీకి ఎంతో జోష్ ని తెచ్చారు.

అంతే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో హైదరాబాద్ కార్పోరేషన్ లోనూ అత్యధిక సీట్లు బీజేపీ గెలుచుకునేలా చేశారు. ఆయన చాలా అగ్రెసివ్ మోడ్ లో ఉంటారు. ఆయన దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరు. ఆయన డైరెక్ట్ ఎటాక్ చేస్తారు. ఏ విషయం మీద అయినా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారు. దానికి ఉదాహరణ గద్దర్ కి పద్మ అవార్డులు ఇవ్వడం మీదనే అని గుర్తు చేస్తున్నారు.

ఆయన బీజేపీ భావజాలాన్ని జనంలోకి విస్తృతంగా చేర్చడంలో కీలకమైన పాత్ర పోషించారు. చాలా ప్రాంతాలకు బీజేపీ బండి నాయకత్వంలోనే పరిచయం అయింది అన్నది హైకమాండ్ గుర్తించింది అని అంటున్నారు. నిజానికి 2023 చివరిలో తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండాల్సింది. కానీ పార్టీలోని కొందరి ప్రమేయం వల్లనే ఆయనను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు.

ఆ మీదట బండి సంజయ్ లోక్ సభ ఎంపీగా గెలవడం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి. అయితే ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పీఠం మీదనే మనసు ఉందని అంటున్నారు. ఆయనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అంటున్నారు.

ఇక ఇటీవల తెలంగాణాలో నిర్వహించిన కుల గణనలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారని లెక్క తేలింది. దాంతో బీసీల నుంచే కొత్త అధ్యక్షుడు వస్తారని కూడా ప్రచారంలో ఉంది. తెలంగాణాలో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపులు అయిన బీసీల నుంచి కీలక నేతగా ఉండడం బండి సంజయ్ కి కలసి వస్తున్న మరో అంశంగా చెబుతున్నారు

దాంతో ఆయనకే అధ్యక్ష కిరీటం దక్కుతుందని అంటున్నారు. ఇక ఈ పదవి కోసం పోటీ పడుతున్న మరో బీసీ నేత అయిన ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి లభిస్తుంది అని అంటున్నారు. ఆయన పార్టీలో చేరాక ఊపు వచ్చిందని ఆయనకు మరింత ప్రోత్సాహం కల్పిస్తే కచ్చితంగా తెలంగాణాలో బీఆర్ఎస్ కి పట్టుకున్న ఏరియాలు కూడా కమల వికాసానికి దోహదపడతాయన్న అంచనాలు ఉన్నాయట.

దాంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా బాధ్యతలు చూసేలా చేస్తూ ఈటెల బండిలకు పదవులు అప్పగించాలని కమల నాధులు డిసైడ్ చేసినట్లుగా భోగట్టా. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం మరో ఎంపీ రఘునందనరావు. అలాగే మాజీ మంత్రి డీకే అరుణ సహా ఇతర ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. వారికి ఏ పదవులు దక్కుతాయో చూడాల్సి ఉంది.