కేసీఆర్ మందు తాగి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు: బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 22 Feb 2025 1:45 PM GMTరాజకీయాల్లో ఎంత నోరుపారేసుకుంటే అంత పాపులారిటీ వస్తుందని నేతలు భావిస్తున్నట్టు ఉన్నారు. ఇటు తెలంగాణలో అయినా.. అటు ఏపీలో అయినా నేతలు అందరూ అదే పనిచేస్తున్నారు. వివాదాస్పదంగా మాట్లాడిన వారే పాపులర్ అవుతుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లే ఫైర్ బ్రాండ్లుగా రాజకీయాల్లో పేరొందుతున్నారు. అందుకే రెండు రాష్ట్రాల్లోనూ తిట్టడమే నేతలు పనిగా పెట్టుకొని వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాన్ని రాజేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 317 జీవో అమలులో జరిగిన ఘటనల గురించి ప్రస్తావిస్తూ "ఆ రోజు కేసీఆర్ ఫుల్ గా మందు తాగి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు" అని బండి సంజయ్ విమర్శించారు. ఆ రోజు పరిస్థితుల గురించి వివరిస్తూ, "గంట టైం ఇస్తున్నా దీక్ష చేస్తున్న కార్యాలయాన్ని జేసీబీతో కూలగొట్టి వీడియో కాల్ చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మా కార్యకర్తలపై దాడి చేసి తలలు పగులగొట్టారు, కాళ్లు విరగగొట్టారు. నేను టీచర్ల కోసం కొట్లాడి నాలుగు రోజులు జైలుకు వెళ్లాను" అని పేర్కొన్నారు.
-అసలు వివాదానికి కారణమేంటి?
317 జీవో వ్యవహారం అప్పట్లో తెలంగాణలో రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ జీవో ద్వారా ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం అమలు చేయగా, అందుకు వ్యతిరేకంగా ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆ సమయంలో బీజేపీ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది.
-కేసీఆర్ తీరుపై మరోసారి బండి విమర్శలు
బండి సంజయ్, తెలంగాణలోని ప్రస్తుత పాలనపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. నిరసన తెలిపే హక్కును కూడా కాదనుకుంటున్నారు" అని ఆరోపించారు.
కేంద్ర మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. అయితే, బీజేపీ తరచుగా కేసీఆర్‌ను విమర్శించడం కొత్తేమీ కాదు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ ఆరోపణలు కొత్త చర్చకు దారితీశాయి.