Begin typing your search above and press return to search.

అల్లుడి కోసమే మూసీ.. దోపిడీని అడ్డుకొని తీరుతాం.. సంజయ్ హాట్ కామెంట్స్

మూసీ సుందరీకరణపై కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 10:33 AM GMT
అల్లుడి కోసమే మూసీ.. దోపిడీని అడ్డుకొని తీరుతాం.. సంజయ్ హాట్ కామెంట్స్
X

మూసీ సుందరీకరణపై కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచి తాము మూసీకి కాదంటూ చెబుతూ వస్తున్న సంజయ్.. కేవలం మూసీ పేరిట జరుగుతున్న దోపిడీకే తాము వ్యతిరేకం అని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలోని మూసీ బాధితులను బీజేపీ నేతలు పరామర్శించారు. వారి తరఫున ఉండి కొట్లాడుతామని భరోసా ఇచ్చారు. ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వమని హామీలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, తదితర నేతలు ఆయా ప్రాంతాల్లో బాధితులను కలిశారు. అందులో భాగంగా నేడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వేదికగా మహాధర్నా చేపట్టారు. ఇందులో కిషన్ రెడ్డి, సంజయ్ పాల్గొన్నారు.

నిత్యం సంచలన వ్యాఖ్యలు.. సంచలనాలతో వార్తల్లో నిలిచే సంజయ్.. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై కీలక ఆరోపణలు చేశారు. ధర్నాలో భాగంగా సంజయ్ మాట్లాడారు. లండన్, సియోల్ కాదు.. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా అని నిలదీశారు. మూసీ పునరుజ్జీవం పెద్ద స్కామ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సబర్మతి, నమామి గంగతో మూసీకి పోలికేంటని ప్రశ్నించారు. అలాగే.. సబర్మతి ఖర్చుకు.. మూసీ అంచనాలకు పోలిక లేదని, కేవలం అల్లుడి (వాద్రా) కోసమే ఈ దోపిడీకి తెరతీశారని ఆరోపించారు.

50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, పదేళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీలు మూసీ ప్రజల దుస్థితికి కారణమని సంజయ్ ఆరోపించారు. మూసీ ప్రక్షాళన అనేది పెద్ద జోక్ అని.. గతంలోనూ చాలా వరకు ప్రయత్నాలు జరిగాయన్నారు. 1997లో ప్రక్షాళన పేరుతో డ్రామాలు చేశారన్నారు. కర్మన్ ఘాట్‌లో నందనవనం అన్నారని, 2005లో సేవ్ మూసీ క్యాంపెయిన్ పేరుతో హంగామా చేవారని, నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్, జైకా, జపాన్ నిధుల ఖర్చు అంటూ రకరకాల డ్రామాలు ఆడారని ఘాటుగా స్పందించారు. 2014వరకు సమైక్య పాలనలో ఈ దోపిడీ కొనసాగిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే హంగామా చేసినా ప్రాజెక్టు ముందుకు పడలేదన్నారు.

లక్షన్నర కోట్లతో లండన్‌లోని థేన్స్ మాదిరి మూసీని మారుస్తానని ముఖ్యమంత్రి చెప్తుంటే.. మంత్రులేమో దక్షిణకొరియా సియోల్‌లోని చంగ్ ఏ చంగ్ నదిలా మారుస్తామంటూ అక్కడికి వెళ్లారని సంజయ్ ఎద్దేవా చేశారు. మూసీ పరిధిలో కబ్జాలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం నేతల బిల్డింగుల జోలికి మాత్రం పోలేదని అన్నారు. ఆ బిల్డింగుల జోలికి పోయే దమ్ముందా..? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పైసలు ముట్టజెప్పేందుకే ఈ మూసీ ప్రాజెక్టును ముందరేసుకున్నారని అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. కాంగ్రెస్ చేస్తున్న దోపిడీని తప్పకుండా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ప్రపంచంలోనే ఇంతటి స్కాం మరోటి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.