ఢిల్లీ ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉంటుంది: బండి
ఇక, ప్రస్తుత కాంగ్రెస్‌పై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత ప్రారంభమైందన్న బండి.. ఈ గ్యాప్ లో బీజేపీ పుంజుకుందన్నారు.
By: Tupaki Desk | 8 Feb 2025 1:30 PM GMTఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతున్న విధానంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ నాయకుడు.. బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ముందుగానే ఊహించినవేనని చెప్పా రు. సమష్టి కృషి, మోడీ నాయకత్వం.. బాగా పనిచేశాయన్నారు. అనుకున్న విధంగా వ్యూహాన్ని రక్తి కట్టించడంలో ఢిల్లీ పెద్దలు సక్సెస్ అయ్యారని తెలిపారు. ఢిల్లీ విజయం మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డాల కృషేనని ఆయన పేర్కొన్నారు.
అయితే.. కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేశారని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ విడుదల అవుతున్న దరిమిలా.. మీడియాతో డిల్లీలో బండి సంజయ్ మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల ఫలితా లు.. తెలంగాణపై ప్రభావం చూపుతాయని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు.. ఎంతో సమయం లేదన్నారు. బీఆర్ఎస్ దుష్టుల పార్టీ.. రాచ కుటుంబానికి చెందిన పార్టీగా ప్రజలు గుర్తించారని అందుకే తరిమి కొట్టారన్నారు.
ఇక, ప్రస్తుత కాంగ్రెస్‌పై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత ప్రారంభమైందన్న బండి.. ఈ గ్యాప్ లో బీజేపీ పుంజు కుందన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో పార్టీ పూర్తిస్థాయిలో తెలంగాణపై పట్టు దక్కించుకుంటుందన్న ఆశాభావం ఉందన్నారు. మేధావి వర్గాలు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ వైపు నిలిచాయని బండి చెప్పారు. అదే విధంగా తెలంగాణలోని మేధావులు కూడా తమ ఆలోచనను మార్చుకుంటారని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం దక్కించుకుంటుందని చెప్పారు.