మాది టీమిండియా.. కాంగ్రెస్‌ది టీమ్ పాకిస్తాన్!: బండి షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన.. తమ సభ్యులను టీమిం డియాతో పోల్చారు.
By: Tupaki Desk | 25 Feb 2025 9:47 AM GMTతెలంగాణ బీజేపీ సీనియర్‌నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన.. తమ సభ్యులను టీమిం డియాతో పోల్చారు. అదేసమయంలో కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నవారిని.. పాకిస్థాన్ టీంగా అభివర్ణిం చారు. ''బీజేపీ ఇండియా టీమ్.. కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీమ్'' అన్న బండి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
పైగా.. ఇటీవల రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో పర్యటించారు. దీనిని కూడా బండి విమర్శించారు. రేవంత్ పర్యటన తో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందన్నారు. తెలంగాణలో 4 కోట్ల 30 లక్షల జనాభా ఉంటే.. 3 కోట్ల 70లక్షల మందే ఎలా వస్తారని, కుల గణనలో ఏమైనా జిమ్మిక్కులు చేశారా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఆ ప్రజలే కాంగ్రెస్‌కు బొంద పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ కేసులపై మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? అని ప్రశ్నించారు.
అదేసమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు, కేటీర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని బండి నిలదీశారు. దమ్ముంటే కేసిఆర్ కేసులను సిబిఐ ఐ కిఅప్పగించాలని బండి సవాల్ రువ్వారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈవెంట్ ఆర్గనైజర్ ను ఎందుకు చేర్చలేదన్నారు. అదేసమయంలో కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ళల్లో అక్రమాలు జరిగితే.. ఎందుకు విచారించలేదని బండి ప్రశ్నించారు. అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్ కేసు ఏమైందన్నారు.
కాగా.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందన్న బండి.. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. ఈ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని ఆయన గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. వచ్చే గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సూచించారు.