Begin typing your search above and press return to search.

బండి కీలక వ్యాఖ్యలు... పవన్ పై అభిప్రాయం ఇదేనా?

ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా, కేంద్రంలో ఇంకోలా వ్యవహరిస్తుండటం పవన్ స్టైల్ పాలిటిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:03 AM GMT
బండి కీలక వ్యాఖ్యలు... పవన్  పై అభిప్రాయం ఇదేనా?
X

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ది ఒక భిన్నమైన శైలి అని చెప్పుకోవచ్చు. అది రాజకీయలపై అవగాహన లేక చేస్తున్న చర్య.. లేక, జనం ఎట్టిపరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేసేస్తారులే అనే బ్లైండ్ నమ్మకమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా, కేంద్రంలో ఇంకోలా వ్యవహరిస్తుండటం పవన్ స్టైల్ పాలిటిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీతో కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్. మరోపక్క తాను బీజేపీతో పొత్తులో ఉన్నానని చెబుతున్నారు. మరోపక్క ఎన్డీయే నుంచి బయటకు వచ్చానని చెప్పిన ఆయన... తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు ఎవడు చెప్పాడు అని సీరియస్ అయ్యారు! ఇదే సమయంలో తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు!

ఇలా తాను ఎన్డీయేలో ఉన్నాను.. ఎన్డీయేలో లేని టీడీపీతో కలిపి ఏపీలో పోటీ చేస్తాను.. ఎన్డీయేలో ప్రధాన పార్టీ అయిన బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తాను.. అని చెప్పగల రాజకీయ నైపుణ్యం, చాణక్యం, పరిణితి పవన్ కల్యాణ్ సొంతం అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! ఇలా తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్రక‌టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ను ఆ రాష్ట్ర బీజేపీ ఏ మాత్రం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది.

అవును... మీ ఇంటికి మా ఇళ్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇళ్లూ అంతే దూరం అని చెప్పాలనుకుంటున్నారో.. లేక, పొలిటికల్ గా పరిగణలోకి తీసుకోవాల్సినంత పనోడు కాదని భావిస్తున్నారో తెలియదు కానీ... తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం పవన్ ను లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

ఇందులో భాగంగా... తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌ని బండి సంజ‌య్ తేల్చి చెప్పారు. తెలంగాణ‌లో బీజేపీకి అనుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని.. తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతోంద‌నే ప్రచారంలో వాస్తవం లేద‌ని చెప్పిన ఆయన... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో... తెలంగాణ‌లో 32 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని జనసేన ప్రక‌టించ‌డంతో ఇక ఆ పార్టీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ద్దని టి.బీజేపీ ఓ నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

ఇదే సమయంలో గత కొంతకాలంగా పవన్ ప్రవర్తనను నిశితంగా గమనిస్తున్న బీజేపీ నేతలు... తెలంగాణ‌లో కాపుల ఓట్లు బీజేపీకి ప‌డ‌కుండా, పరోక్షంగా కేసీఆర్‌ కు రాజ‌కీయంగా ల‌బ్ధి క‌లిగించేందుకే జనసేన బ‌రిలో నిలుస్తోంద‌ని అనుమానిస్తున్నారని తెలుస్తుంది. ఇలా ఏపీలో ప్రతక్షంగా టీడీపీకి, తెలంగాణలో పరోక్షంగా బీఆరెస్స్ కు లబ్ధి చేకూర్చే విధంగా పవన్ వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు.

ఏది ఏమైనా... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ కల్యాణ్ జనసేనతో తనదైన, విభిన్నమైన రాజకీయలు చేస్తున్నారనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి. మరి రాజకీయంగా ఆయన అంతిమ లక్ష్యం ఏమిటి అనే సంగతి కాసేపు పక్కనపెడితే... గమ్యం లేనట్లుగా సాగుతున్న ఈ రాజకీయ ప్రయాణంలో ఆర్థిక ప్రయోజనాలే ప్రధానంలా ఉంది అని కాషాయం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.