Begin typing your search above and press return to search.

ఏపీపై బండి ఫోకస్

తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ను అధిష్ఠానం తప్పించడంతో స్థానిక కార్యకర్తలు, నేతల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Aug 2023 9:02 AM GMT
ఏపీపై బండి ఫోకస్
X

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తున్నారు. తాజాగా ఏపీలోని అధికారి వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయడమే అందుకు కారణమని చెప్పాలి. ఈ సారి వైసీపీ అధికారంలోకి రాదనే భావన ప్రజల్లో ఉందని, బీజేపీకి అవకాశం ఇస్తేనే రాష్ట్ర డెవలప్ అవుతుందని సంజయ్ పేర్కొన్నారు.

తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ను అధిష్ఠానం తప్పించడంతో స్థానిక కార్యకర్తలు, నేతల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన బీజేపీ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్కు బాధ్యతలు అప్పజెప్పింది. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నాయకుడికి ఒక రాష్ట్రం బాధ్యతలు కట్టబెట్టడం బీజేపీలో ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఏపీలో బీజేపీ ఇంఛార్జీగా సంజయ్ను నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడదే నిజమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఏపీపై ఫోకస్ పెట్టారనే చెప్పాలి. తాజాగా ఓటర్ చేతన్ మహాభియాన్లో భాగంగా విజయవాడలోని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. ఏపీలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేలకు పైగా నకిలీ ఓట్లను చేర్చేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సంజయ్ ఆరోపించారు. ఈ విషయంపై సీరియస్గా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. గంజాయి విక్రయాలు, ఇసుక దందా, భూ కబ్జాలు ఏపీలో పెరుగుతున్నాయని విమర్శించారు. అంతే కాకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.