సీఎం సీఎం అంటూ ఆగమాగం చేస్తున్నారే... బండి సంజయ్ రుసరుస...!
మొత్తానికి మనసులో ఉన్న మాట అలా బయటకు వచ్చేసింది. బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ దూకుడు చేసేవారు
By: Tupaki Desk | 9 Nov 2023 3:26 PM GMTమొత్తానికి మనసులో ఉన్న మాట అలా బయటకు వచ్చేసింది. బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ దూకుడు చేసేవారు. తానే తరువాత సీఎం అని కూడా ఆయన భావించేవారు అని అంటారు. అపుడు కాలం అలా కలసివచ్చి కమలం వికసించినట్లుగా కనిపించింది. అది భ్రాంతి అని తెలిసేసరికి బండి సంజయ్ బీజేపీ ప్రెసిడెంట్ బండి దిగాల్సి వచ్చింది
దాంతో ఆయనలో ఎక్కడో అసంతృప్తి అలా ఉండిపోయింది. పెద్దల వద్ద బయటపడకపోయినా తాజాగా మాత్రం ఆయన నోరు విప్పేశారు. అది ఎలా జరిగింది అంటే మంచిర్యాల జిల్లా జిన్నారంలో జరిగిన బీజేపీ సభలో బండి సంజయ్ మాట్లాడుతూండగా బీజేపీ క్యాడర్ అంతా ఒక్కసారిగా సీఎం సీఎం అంటూ నినాదాలు స్టార్ట్ చేశారు.
బండి ప్రసంగం వినబడకుండా వారు అలా స్లోగన్స్ ఇవ్వడంతో బండి సంజయ్ ఖుషీ కాకపోగా కొంత ఆవేదన ఆవేశానికి గురి అయ్యారు. ఇలాగే సీఎం సీఎం అని ఆగమాగం చేసినందుకే నా బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ పోయింది అంటూ నవ్వుతూ అంటించేశారు. అయితే ఆయన అలా బయటకు నవ్వినా ఆ నవ్వుల వెనక రుసరుసలు ఉన్నాయని అంటున్నారు
అవి బీజేపీలో ఎవరికి తగలాలో వారికే తగిలాయని కూడా అంటున్నారు. అంటే బండికి బ్రేకులు వేయడానికే బీజేపీ ప్రెసిడెంట్ పదవిని కత్తిరించారని ఇప్పటిదాకా ప్రత్యర్ధులు సొంత పార్టీలో ఆయన వర్గం అంటున్న మాటలు నిజమే అని బండి చెప్పేసుకున్నారు అన్న మాట.
మరో వైపు చూస్తే బండి సంజయ్ ప్రెసిడెంట్ పదవి పోయిన దగ్గర నుంచి మునుపటి మాదిరిగా యాక్టివ్ గా అయితే లేరు. ఆయనలో గతంలో కనిపించిన చురుకుదనమూ లేదు అని అంటున్నారు. అదే విధంగా ఆయనకు బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి కట్టబెట్టినా ఆయనలో ఉత్సాహం అయితే కనిపించడంలేదు.
ఇపుడు ఆయన మనసులో బాధ ఏముందో అది ఒక్కసారిగా బయటపడింది అని అంటున్నారు. సీఎం సీఎం అని తనను అనవద్దు అని ఆయనే చెప్పేసుకుంటున్నారు. ఒకనాడు క్యాడర్ అన్నారని కాదు బండిలో కూడా ఆ ఆశలు ఉండేవని అంటారు. అందుకే ఆయన కేసీయార్ దిగిపోతారు అంటూ బిగ్ సౌండ్ చేస్తూ ఉండేవారు.
ఇపుడు మాత్రం బండి బీసీ సీఎం వస్తారు అని క్యాడర్ కి చెబుతున్నారు ఆ బీసీ సీఎం ఎవరో అన్నది మాత్రం ఆయన చెప్పలేదు మరి బీసీ నేతగా మాజీ మంత్రిగా ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నారు. అలా ఇద్దరు కీలక బీసీ నేతల మధ్యన పోరు అయితే రసవత్తరంగా సాగుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలో బండి వ్యాఖ్యలు మాత్రం ఆసక్తిని రేపుతున్నాయి. బండి సీఎం అంటేనే ఆయన భయపడిపోతున్నారు అని సెటైర్లు పడుతున్నాయి. ఇంతకీ బీజేపీకి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా అన్నది కూడా చూడాలి కదా అన్న మాట వినిపిస్తోంది.