నాడు బండి చెప్పినట్లు.. ట్యాపింగ్ ఎపిసోడ్ లో కేసీఆర్ కు జైలు తప్పదా?
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ నోటి నుంచి తరచూ ఒక మాట వస్తూ ఉండేది.
By: Tupaki Desk | 28 May 2024 4:31 AM GMTతెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ నోటి నుంచి తరచూ ఒక మాట వస్తూ ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని.. ఆయన చంచలగూడ జైల్లో ఉండటం ఖాయమని చెప్పేవారు. దీనికి కౌంటర్ గా కేసీఆర్ ను జైలుకు పంపే దమ్ము.. ధైర్యం ఎవరికి ఉంది? కేసీఆర్ జైలుకు వెళితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? అంటూ కేసీఆర్ అండ్ కో తీవ్రంగా రియాక్టు అయ్యేవారు. అయినప్పటికీ.. బండి నోటి నుంచి పదే పదే జైలుమాట వచ్చేది. కట్ చేస్తే.. అప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన జైలు మాట.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో సింక్ అవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు వెలువడిన అంశాలకు.. తాజాగా రాధాకిషన్ రావు నేరాంగీకార వాంగ్మూలాన్ని చూసినప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొత్త తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అన్న సామెతకు తగ్గట్లే.. కేసీఆర్ కు ట్యాపింగ్ కష్టాలు చుట్టుముట్టటం ఖాయమని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అంచనా బలంగా వినిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కు ఒకట్రెండు ఎంపీ సీట్లకు పరిమితమైతే.. చర్యలు వేగం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి కారణం.. తన కూతురు కవిత కోసం కేంద్రంలోని మోడీ సర్కారుకే షాకిచ్చేలా ప్లాన్ చేసిన అంశం రాధాకిషన్ రావు వాంగ్మూలంతో బయటకు రావటంతో బీజేపీ అగ్రనాయకత్వం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. తమపై ఎవరూ సాహసించని స్కెచ్ వేసిన కేసీఆర్ ను అంత తేలిగ్గా వదలకూడదని.. అలా చేస్తే.. రానున్న రోజుల్లో తమకు చాలానే తిప్పలు తప్పవన్నట్లుగా వారు భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కూతురు కవితను సేవ్ చేసుకోవటానికి బీజేపీ మీద స్కెచ్ వేయటం ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్నీ గీతల్ని దాటేసి.. తన ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ను అంత తేలిగ్గా వదలకూడదన్నట్లుగా కాంగ్రెస్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవైపు బీజేపీ.. మరోవైపు కాంగ్రెస్ కు ఉమ్మడి శత్రువుగా మారిన కేసీఆర్ కు దన్నుగా నిలిచే వారు ఎవరూ ఉండకపోవచ్చంటున్నారు. సాధారణంగా జాతీయ పార్టీల్లో ఎవరో ఒకరి రక్ష అవసరమవుతుంది. కానీ.. కేసీఆర్ విషయంలో మాత్రం ఆ అవకాశం లేదంటున్నారు.
తెలంగాణ సాధన తర్వాత అధికారంలో కోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి తన తెలివితో జెల్లకాయ కొట్టి.. నాన్ స్టాప్ గా పదేళ్లు అధికారాన్ని అనుభవించిన వైనం గాంధీ ఫ్యామిలీని రగిలిపోయేలా చేసిందంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీని కంట్రోల్ చేయాలన్న కేసీఆర్ ఎత్తుగడ బయటకు వచ్చిన నేపథ్యంలో కమలనాథులు సైతం కోపంతో ఉన్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కు అండగా నిలవకూడదన్న ఉద్దేశంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు అంశాలు ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో కేసీఆర్ కు గతంలో ఉన్న పలుకుబడి.. ప్రజల్లో ఆదరణ లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైనా చేయొచ్చని.. ఆయన దుర్మార్గాలను ఆధారాలతో ఎత్తి చూపిన తర్వాత ప్రజాస్వామ్య పద్దతిలో జైలుకు పంపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. అయితే.. చెప్పినంత తేలిగ్గా జరగదని.. దానికి మరెంతో కసరత్తు అవసరమని అంటున్నారు. ఏమైనా.. కేసీఆర్ టైం చాలా బ్యాడ్ గా ఉందన్న మాట మాత్రం అందరి నోట వినిపిస్తోంది.