ఆరు గ్యారంటీ లపై రేవంత్ కు షాక్ ఇస్తున్న బండి సంజయ్
ప్రతి మహిళకు రూ. 2500 జమ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.
By: Tupaki Desk | 15 March 2024 10:53 AM GMTకాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వంద రోజులు డెడ్ లైన్ ముగిసినా వాటి అమలుపై చొరవ తీసుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
ప్రతి మహిళకు రూ. 2500 జమ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నెలకు రూ. 4 వేలు పింఛన్ అమలు చేస్తామన్నారు? కానీ చేయడం లేదు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు? ఇవ్వడం లేదు. ఇలా ఇచ్చిన హామీలు గాలికొదిలి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు సమ ఉజ్జీలే అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కూడా ఇలాగే వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీల ఆశలు గల్లంతు కావడం ఖాయమే. బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు. ఇక కాంగ్రెస్ కు కూడా చావు తప్పి కన్ను లొట్టపోతుందని పేర్కొన్నారు. ప్రజలు కీలెరిగి వాత పెడతారని సూచించారు.
కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిందన్నారు. ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతోందని విమర్శించారు. ఖజానాలో పైసలు నిండుకోవడంతో కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. డబ్బు ఎక్కడ నుంచి తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో పాలన అంత సులభం కాదని ఇప్పటికే అర్థమైపోయిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే గడువు పూర్తయితే వాటిని ఆచరణలో పెట్టే పనులు చేపట్టడం లేదని పేర్కొన్నారు. ప్రజల కోరికలు నెరవేర్చేందుకు ఇచ్చిన హామీలు తీర్చాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఇంకా ఎన్నాళ్లు ప్రజలను వేచి చూసేలా చేస్తుందో తెలియడం లేదన్నారు.