బండి ఫస్ట్ విజయం.. కంటోన్మెంట్ బాధలు తప్పాయ్!
తాను మంత్రిగా బాద్యతలు చేపట్టకముందు.. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన కీలక హామీని నెరవేర్చుకున్నారు.
By: Tupaki Desk | 30 Jun 2024 5:38 AM GMTకేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తెలంగాణ బీజేపీ టైగర్.. కరీంనగర్ ఎంపీ.. బండి సంజయ్ తొలి విజయం దక్కించుకున్నారు. తాను మంత్రిగా బాద్యతలు చేపట్టకముందు.. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన కీలక హామీని నెరవేర్చుకున్నారు. హైదరాబాద్ వాసులకు ఇబ్బందిగా మారిన.. కంటోన్మెంటును నగరంలో విలీనం చేయిస్తానని.. కంటోన్మెంటు సమస్యను తప్పిస్తానని ఆయన ఎన్నికల సమయంలోనూ..దీనికి ముందు కూడా.. ఆయన చెప్పారు.
దీనికి సంబందించి ఆయన ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడానికి ముందు .. గెలిచిన తర్వాత.. తొలి హామీ ఇదేనని చెప్పారు. దీనిపై ఈ నెల 7నే.. కేంద్ర హోం శాఖ అధికారులను కలిసి మరోసారి ఈ సమస్యపై వినతి పత్రం సమర్పించారు.కంటోన్మెంట్ ఏరియాను హైదరాబాద్‌లో కలిపేయాలని ఆయన విన్నవించారు. దీనివల్ల భాగ్యనగరవాసులకు ఇబ్బందులు తప్పుతాయని.. ఆయన విన్నవించారు.
ఆ తర్వాత.. ఆయనకేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక, తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. కేంద్ర రక్షణ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని కంటోన్మెంటు ఏరియాను హైదరాబాద్ మహానగర మునిసిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం రక్షణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర హోం శాఖ.. సూచనల మేరకు.. కంటోన్మెంటు ఏరియాను హైదరాబాద్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బండి సంజయ్ మంత్రిగా తొలి విజయం దక్కించుకున్నట్టు అయింది.
ఏంటి ఇబ్బందులు-డిమాండ్లు!
+ కంటోన్మెంటు ఏరియా అంటే.. పూర్తిగా కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది.
+ ఇక్కడ నివసించే సాధారణ ప్రజలపై కొన్ని ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షలు తొలగించాలన్నది ప్రధాన డిమాండ్.
+ ఎప్పుడుబడితే అప్పుడు వచ్చి వెళ్లేందుకు వీలు ఉండదు. రాత్రి 7 - 8 మధ్య కంటోన్మెంటు ఏరియా గేట్లు మూసేసి.. కాపలా పెడతారు. దీంతో ఈ ఏరియాలోకి వెళ్లాలంటే.. మరో మార్గం నుంచి 7 కిలో మీటర్లు ప్రయాణించి చేరుకోవాలి. దీనిని తప్పించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. గతంలోకేటీఆర్ కూడా.. దీనిని డిమాండ్ చేశారు.
+ ముఖ్యంగా సైనిక స్థావరాలు ఉండడంతో ఇక్కడ ప్రత్యేక పాలన అమలవుతోంది. దీంతో ఆధార కార్డు చూపించి ప్రజలు ఒక్కొక్కసారి రాకపోకలు చేయాల్సి వస్తోంది.
+ కీలక సమయాల్లో నిషేధాజ్ఞలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.
+ మరీ ముఖ్యంగా ఇక్కడ అభివృద్ది చేయాలన్నా.. ఏ చిన్న పనిచేయాలన్నా.. కంటోన్మెంటు అధికారి అనుమతి అవసరం. ఇది లేకపోతే.. ఇక్కడ చిన్న కాలువ పూడిక తీసేందుకు కూడా అవకాశం లేదు. దీంతో ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. దీనినే గత మంత్రి కేటీఆర్ ప్రస్తావించేవారు. ఇక, ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం లభించినట్టు అయింది.