బండి సంజయ్ పై హైకోర్టు ఆగ్రహం.. జరిమానా!
బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు గడువు కోరిన తర్వాత కూడా మళ్లీ గడువు కోరడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది
By: Tupaki Desk | 6 Sep 2023 4:16 AM GMTబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు షాక్ తగిలింది. ఆయన తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరీంనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కు సంబంధించి అడ్వొకేట్ కమిషనర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ కు బండి సంజయ్ గైర్హాజరు కావడంపై హైకోర్టు మండిపడింది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది.
బండి సంజయ్ ఇప్పటికే పలుమార్లు గడువు కోరిన తర్వాత కూడా మళ్లీ గడువు కోరడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన హాజరు కాని నేపథ్యంలో ఈ పిటిషన్ లో విచారణను ముగిస్తామని వెల్లడించింది. బండి సంజయ్ సెప్టెంబర్ 12న హాజరవుతారని ఆయన న్యాయవాది తెలపడంతో.. హైకోర్టు జరిమానాతో సరిపెట్టింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
2018 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున గంగుల కమలాకర్ పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో గంగుల తప్పుడు వివరాలు ఇచ్చారని.., ఆయన ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ ఆయనపై ఎన్నికల్లో ఓటమి పాలైన బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూర్ సుమలత తాజాగా విచారణ చేపట్టారు. ఇరుపక్షాల సాక్ష్యాలను నమోదు చేయడం కోసం న్యాయమూర్తి ఈ ఏడాది జూన్ లో అడ్వొకేట్ కమిషనర్‌గా విశ్రాంత జడ్జి శైలజను నియమించారు. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్‌కు నాలుగుసార్లు గైర్హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యవహార శైలిపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు పలుమార్లు డుమ్మా కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. ఈసారి విచారణకు రాకుంటే ఈ పిటిషన్ పై విచారణ ముగిస్తామని తేల్చిచెప్పింది.