Begin typing your search above and press return to search.

కార్పోరేటర్ నుంచి కేంద్ర మంత్రి !

2005లో కార్పోరేటర్ గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బండి సంజయ్ సరిగ్గా 19 ఏళ్లలో కేంద్రమంత్రి స్థాయికి ఎదిగాడు

By:  Tupaki Desk   |   10 Jun 2024 4:30 PM GMT
కార్పోరేటర్ నుంచి కేంద్ర మంత్రి !
X

2005లో కార్పోరేటర్ గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బండి సంజయ్ సరిగ్గా 19 ఏళ్లలో కేంద్రమంత్రి స్థాయికి ఎదిగాడు. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో స్వయం సేవకుడిగా పని చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో రెండు పర్యాయాలు (1994-1999, 1999-2003) డైరెక్టర్గా పని చేశారు. ఎల్.కె. అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో 35 రోజులు వెహికల్ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తించారు.

కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా, రెండోసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ బీజేపీ అధ్యక్షునిగా సేవలు అందించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్, అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్, టొబాకో బోర్డు మెంబర్గా నియామకం అయ్యారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకం అయ్యారు. 2023 జులైలో అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ని తప్పించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా 2.25 లక్షల ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. రెండోసారి విజయం సాధించిన బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి అవకాశం దక్కింది.