Begin typing your search above and press return to search.

బండి సంజయ్ ఈసారైనా గెలుస్తారా...లేదంటే హ్యాట్రిక్ ఓటమే...!

బండి సంజయ్ అన్న పేరు కొన్నాళ్ళ పాటు తెలంగాణా రాజకీయాల్లో పాపులర్ అయింది బీజేపీ ప్రెసిడెంట్ గా ఆయన 2020 నుంచి 2023 వరకూ కొనసాగారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 4:30 PM GMT
బండి సంజయ్ ఈసారైనా గెలుస్తారా...లేదంటే హ్యాట్రిక్ ఓటమే...!
X

బండి సంజయ్ అన్న పేరు కొన్నాళ్ళ పాటు తెలంగాణా రాజకీయాల్లో పాపులర్ అయింది బీజేపీ ప్రెసిడెంట్ గా ఆయన 2020 నుంచి 2023 వరకూ కొనసాగారు. ఆయన హయాంలో పలు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అలాగే హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో అర్ధ సెంచరీ దాకా ఎగబాకింది. అయితే మునుగోడు, నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఓడింది కూడా.

ఇదిలా ఉంటే బండి సంజయ్ 2014లో తొలిసారి కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు ఉంది. 27.8 శాతం ఓటు షేర్ ని ఆ ఎన్నికల్లో సాధించిన బండికి 52 వేల 455 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్ధిగా బీయారెస్ నుంచి పోటీ చేసిన గంగుల కమలాకర్ 40.22 శాతం ఓటు షేర్ ని సాధించారు. ఆయనకు 77 వేల 29 ఓట్లు దక్కాయి. పాతిక వేల ఓట్ల తేడాతో బండి మీద ఆయన గెలుపొందారు.

ఇక 2018లో బీజేపీ ఒంటరిగా తెలంగాణాలో పోటీ చేసింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ రెండవ మారు పోటీ చేస్తే గంగుల ఆయన మీద 14 వేల 974 ఓట్లతో విజయం సాధించారు. అయితే మెజారిటీ గతానికి 2018 నాటికి పడిపోయింది. ఇక ఇపుడు ముచ్చటగా మూడవసారి ఈ ఇద్దరు ప్రత్యర్ధులూ పోటీకి దిగుతున్నారు.

రెండు సార్లు ఓడిన సానుభూతి అయితే బండికి ఉంది. అలాగే రెండు సార్లు గెలిచిన తరువాత మంత్రిగా పనిచేసిన తరువాత ఏర్పడిన ప్రజా వ్యతిరేకత గంగులకు ఉంది. ఇక బీయారెస్ పార్టీ కి యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఉంది. అలా గంగుల కొంత ఇబ్బందులలో ఉన్నారు.

బండికి మరో సానుభూతి యాడ్ అవుతోంది. అదేంటి అంటే ఆయన్ని అర్ధాంతరంగా బీజేపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించారు అన్న భావన పార్టీ క్యాడర్ లో ఉంది. అలాగే జనాలలో కొంత ఉంది. బండి 2018 నాటి కంటే ఇపుడు చూస్తే స్టేట్ ఫిగర్ గా ఉన్నారు. అది ఆయనకు అడ్వాంటేజ్. ఇక బీసీ సీఎం అని బీజేపీ నినాదం ఇచ్చింది. అలా బండి సంజయ్ సీఎం క్యాండిడేట్ అని ప్రచారం చేస్తున్నారు.

వీటితో పాటు ఆయన 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అలా ఇమేజ్ ని పెంచుకున్న బండి సంజయ్ గెలుపు కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. గంగుల వర్సెస్ బండిగానే ఫైటింగ్ ఇక్కడ ఉంది. కాంగ్రెస్ అభ్యర్ధిగా బొమ్మకల్ గ్రామ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. ఈయన అసెంబ్లీ బరిలో తొలిసారి అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు.

చిత్రమేంటి అంటే మూడు పార్టీలకు చెందిన అభ్యర్ధులూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారే. ఇక గంగులకు ప్లస్ పాయింట్స్ అభివృద్ధి కార్యక్రమాలు. అలాగే ఆయన రాజకీయ వ్యూహాలు. అధికార పార్టీ అండదండలు. కరీంనగర్ లో బీయారెస్ కి ఉన్న పట్టు.

బీజేపీకి బండి సంజయ్ కి హిందూత్వ అన్నది ఒక అడ్వాంటేజ్. అలాగే యూత్ లో బండికి ఉన్న క్రేజ్ కూడా మరో ప్లస్ పాయింట్. ఇవన్నీ ఇలా ఉన్నా బండి సంజయ్ ని మళ్ళీ ఓడిస్తాను అని గంగుల అంటున్నారు. ఆయనకు ఇది మూడవ ఓటమి అవుతుంది అని గంగుల చెబుతున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే తానేనని అంటున్నారు. మరి హ్యాట్రిక్ ఓటమికి బండి సిద్ధంగా ఉన్నారా లేక గెలుపు కోసం గట్టిగా నిలబడి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తారా అంతే వెయిట్ అండ్ సీ.