ఇమేజ్‌లో ఎవరు గొప్ప.. బండి వర్సెస్ కిషన్‌రెడ్డి...!
మరి బీజేపీ మాటేంటి? ఆ పార్టీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డికి ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందా? ఆయనకుఫైర్ బ్రాండ్‌నాయకుడిగా ముద్ర ఉందా?
By: Tupaki Desk | 8 Nov 2023 12:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయిన బీజేపీ.. ఆ దిశగా యుద్ధాన్ని ముమ్మరం చేసింది. దాదాపు 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించి.. ప్రచారం దూసుకుపోయేలా ప్లాన్ చేసింది. అయితే.. బీఆర్ ఎస్‌కు సీఎం కేసీఆర్ ఐకాన్ గా ఉన్నారు. కాంగ్రెస్‌కు రేవంత్ ఉన్నారు. వీరికి ప్రజల్లో మంచి ఫాలో యింగ్ ఉంది. రేవంత్ ఇటీవల నామినేషన్‌కు వెళ్లినప్పుడు జనం ప్రభంజనంగా తరలి వచ్చారు. ఇక, కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరి బీజేపీ మాటేంటి? ఆ పార్టీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డికి ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందా? ఆయనకుఫైర్ బ్రాండ్‌నాయకుడిగా ముద్ర ఉందా? ఓ లక్ష మందిని ఆయన కదిలించగలరా? అంటే.. సందేహమే. ఈ నేపథ్యంలోనే బీజేపీకి ఇప్పుడు ఐకాన్ వంటి నాయకుడు కావాలి. తన ఇమేజ్ తో మాస్ ఓటర్లను ఆకర్షించగల నేత కావాలి. ఇవన్నీ.. ఎలా సాధ్యం? గతంలో అంటే.. బండి సంజయ్ ఉన్నాడు కనుక.. జీహెచ్ ఎంసీ, మునుగోడు, దుబ్బాక, హుజూరాబాద్, సాగర్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అధిష్టానానికి ఇప్పుడు బండి అవసరం ఎంతో ప్రాధాన్యం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే బండి ఇమేజ్‌ను ప్రత్యక్షంగా పరోక్షంగా వినియోగించుకునేందుకు కమల నాథులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాస్తవానికి బీజేపీలో ముందుగా ఎవరినీ సీఎంగా ప్రకటించిన సంప్రదాయం లేదు. ఒక్క గుజరాత్‌లో మాత్రమే ఈ సారి దానికి భిన్నంగా ప్రకటించారు. ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. బండి ఫైర్ బ్రాండ్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్‌పై తీవ్ర యుద్ధమే చేశారు. అరెస్టయ్యారు. పోరు సాగించారు.
ఈ నేపథ్యంలో పైకి ఆయన పేరు చెప్పకపోయినా.. ఆయన తాలూకు సింపతీని ఓటు బ్యాంకుగా మలుచుకోవాల్సిన అవసరం ఇప్పుడు బీజేపీకి ఏర్పడింది. దీంతో బీసీ సీఎం అంటూనే.. అంతర్గతంగా బండి పేరును లీక్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎవరూ పైకి చెప్పరు. కానీ, కిషన్ రెడ్డితో పోల్చుకుంటే.. ఓ వంద ఓట్లు తీసుకురాగల సత్తా బండికే ఉందన్నది బీజేపీ పెద్దలకు కూడా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఇమేజ్ విషయంలో బండిపైనే ఈ దఫా బీజేపీ డిపెండ్ అయిందని అంటున్నారు పరిశీలకులు.