మీకు ఓటమి.. వారికి గెలుపు.. బండ్ల గణేశ్ సంచలన ట్వీట్!
ఏదో అంశంలో ఎప్పుడూ వార్తల్లో ఉండే బండ్ల.. తాజా ట్వీట్ తో మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
By: Tupaki Desk | 10 Feb 2025 1:17 PM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలపై తరచూ స్పందించే ప్రముఖ నిర్మాత, హాస్యనటుడు బండ్ల గణేశ్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎవరిని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారో గానీ.. అందరినీ సస్పెన్స్ లో ఉంచిన బండ్ల... ఏపీలో కూటమిని ఉద్దేశించే ఆ ట్వీట్ చేశారా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో అంశంలో ఎప్పుడూ వార్తల్లో ఉండే బండ్ల.. తాజా ట్వీట్ తో మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.
తెలుగు సినిమాల్లో తన నటనతో అభిమానులను సంపాదించుకున్న బండ్ల గణేశ్ ఆ తర్వాత నిర్మాతగానూ తన అదృష్టం పరీక్షించుకున్నారు. టాలీవుడ్ లే మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను చిత్రీకరించారు. ముఖ్యంగా తన అభిమాన హీరో పవన్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన బండ్ల బాగా లాభపడ్డారని చెబుతారు. ఇక రాజకీయాల్లోనూ పవన్ కు గట్టి మద్దతుదారుగా నిలిచే బండ్ల గణేశ్ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ఎంతగానో కోరుకున్న బండ్ల గణేశ్.. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో తెగ హడావుడి చేసి సోషల్ మీడియాను ఆకర్షించారు. అంతేకాకుండా తన వివాదాస్పద ప్రకటనలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు బండ్ల గణేశ్. తెలంగాణలో బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించే బండ్ల గణేశ్.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా అరెస్టు కావడాన్ని తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు గొప్పవాడంటూ ప్రశంసలతో ముంచెత్తారు. దాంతో టీడీపీ సపోర్టర్లను ఆకర్షించిన బండ్ల.. ఆ తర్వాత కూడా హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను పొగుడుతూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తుండేవారు. అదేసమయంలో ఓ సారి ఏపీ మాజీ సీఎం జగన్ పనితీరుపైనా ప్రశంసలు కురిపించి తన విలక్షణాన్ని చాటుకున్నారు బండ్ల గణేశ్. ఆ వెంటనే చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ ను తీవ్రంగా విమర్శించారు.
ఇలా ఎప్పటికప్పుడు ఏదో అంశంపై రియాక్ట్ అవుతూ టు తెలుగు స్టేట్స్ లో హాట్ టాపిక్ అవుతున్న బండ్ల గణేశ్.. తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘‘గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలువక తప్పదు.. అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు’’ అంటూ భగవద్గీత సారాంశాన్ని వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారా బండ్ల గణేశ్ ఎవరిని టార్గెట్ చేశారనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న బండ్ల గణేశ్.. ఆ పార్టీ సుదీర్ఘకాలం తెలంగాణను పాలించాలని కోరుకుంటున్నారు. దీంతో ఆయన ట్వీట్ ఏపీ పాలిటిక్స్ ను ఉద్దేశించిందా? అని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా ఈ సస్పెన్స్ పై బండ్ల గణేశ్ మాత్రమే క్లారిటీ ఇవ్వాల్సివుందని అంటున్నారు.