సాయిరెడ్డీ.. ఇది ధర్మమా ?
విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీలోనూ చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 24 Jan 2025 5:24 PM GMTఅనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీని మీద రకరకాలుగా సోషల్ మీడియాలో ట్వీట్లు కామెంట్స్ పెడుతున్నారు. విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీలోనూ చర్చ సాగుతోంది.
ఆయన చివరి దాకా జగన్ తో ఉంటారని అంతా భావించారు. ఇపుడు సడెన్ డెసిషన్ తో ఆయన అందరికీ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే సినీ నిర్మాత. తెలంగాణా కాంగ్రెస్ నేత అయిన బండ్ల గణేష్ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం పట్ల వేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది.
అధికారం ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలివేయడం... వదిలి వెళ్లిపోవడం చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిందని విమర్శించారు. ఇది ధర్మమా? అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఇది విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆయన పెట్టిన ట్వీట్ గా భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి విషయంలో ఈ విధంగా బండ్ల గణేష్ రియాక్ట్ కావడం ఆసక్తిని రేపుతోంది.
నిజంగా విజయసాయిరెడ్డి కష్టకాలంలో పార్టీ ఉన్నపుడు తప్పుకోవడం వైసీపీ శ్రేణులకూ రుచించడం లేదు అని అంటున్నారు. అయితే వైసీపీ నేతలు దీని మీద రకరకాలుగా స్పందిస్తున్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే ఒత్తిడితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అంటున్నారు.
వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే విజయసాయిరెడ్డిని పార్టీలో ఉండాలని కోరతామని అన్నారు. ఆయన జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకున్నారని చెప్పారు. పార్టీలో ఆయన అతి ముఖ్య నేత అన్నారు. ఆయన రాజకీయ నిర్ణయం మార్చుకునేలా చూస్తామని అన్నారు. మరో వైపు చూస్తే తాను ఇక రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అవుతాను అని 25వ తేదీన తన రాజీనామాని సమర్పించనున్నట్లుగా చెప్పారు. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి కలకలమే రేపారు అని అంటున్నారు.