Begin typing your search above and press return to search.

చంద్రబాబు, రేవంత్ లపై “కాంగ్రెస్ మేన్” బండ్ల గణేష్ వింత కోరిక!

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్య వార్ ఏ రేంజ్ లో జరిగిందనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   13 Jun 2024 10:38 AM GMT
చంద్రబాబు, రేవంత్  లపై “కాంగ్రెస్  మేన్” బండ్ల గణేష్  వింత కోరిక!
X

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి మధ్య వార్ ఏ రేంజ్ లో జరిగిందనేది తెలిసిన విషయమే. ఇందులో భాగంగా.. ప్రధానంగా బీజేపీ – కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రి ఇలాగే ఉండాలని అంటున్నారు బండ్ల గణేష్.


అవును... నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అభిమానిస్తుంటారు. అయితే దీన్ని కొంతమంది... ఏ రోటికాడ ఆ పాట అని కామెంట్ చేస్తే... పార్టీలకు అతీతమైన అభిమానం అని కూడా అనుకోవచ్చని ఇంకొంతమంది అంటుంటారు.


ఈ క్రమంలో బండ్ల గణేష్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి, తాజాగా ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్డీయే కూటమి అభ్యర్థి, టీడీపీ అధినేత చంద్రబాబుల ఫోటోలు షేర్ చేస్తూ... తన మనసులో ఉన్న కోరికను రాసి పెట్టారు. దీంతో ఈ కోరిక ఆసక్తిగా మారింది.

ఇందులో భాగంగా... "పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. బంధం అనేది విడదీయరానిది. ఎప్పటికీ నా చంద్రన్న, నా రేవంతన్న ఇలానే ఉండాలి. రెండు రాష్ట్రాలనూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ" అని సినీ నిర్మాత, “కాంగ్రెస్ మేన్” బండ్ల గణేష్ ఆన్ లైన్ వేదికగా కోరుకున్నారు.

దీంతో.. ఈ పోస్ట్ పై రకరకాల కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా... "మీ నుంచి చాలా నేర్చుకోవాలన్నా" అని గణేష్ ని ఉద్దేశించి ఒకరు కామెంట్ పెడితే... మరికొంతమంది రేవంత్ టీడీపీలో ఉన్నప్పటి విషయాలను ప్రస్థావిస్తున్నారు! మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నేత.. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండాలని కోరుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు! ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది.