చంద్రబాబు అరెస్ట్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!
ఈ అరెస్టు అనంతరం టీడీపీ - జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 19 Sep 2023 3:18 PM GMTఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ అరెస్టు అనంతరం టీడీపీ - జనసేన పొత్తుపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనదైన రీతిలో స్పందిస్తూ బాబుకు సంఘీభావంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తెలుగు జాతి సంపద అని తెలిపిన ఆయన.. ఏపీని 14 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా పుట్టుకను ఎంత ప్రేమిస్తామో చావును కూడా అంతే ప్రేమిస్తేనే అది నిజమైన బ్రతుకు అని స్పష్టం చేసిన నిర్మాత బండ్ల గణేష్... అనంతరం ఒక విజనరీ రాజమండ్రి జైలులో మగ్గుతుంటే తిండి ఎలా తినాలనిపిస్తుంది అని ప్రశ్నించారు. తనకు మాత్రం చాలా కడుపు మంటగా ఉందని, చాలా బాధగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా... "మీ వెంట నిలబడే వారు ఎవరో చూసుకోండి.. మీరు మళ్లీ రాష్ట్రాన్ని ఏలుతారు.. దేశాన్ని శాసిస్తారు.. ఏమీ పర్లేదు" అని వ్యాఖ్యానించారు గణేష్. శ్రీకృష్ణుడికే తప్పలేదు.. శ్రీరాముడికే వనవాసం తప్పలేదు.. చంద్రబాబుది ఏముంది అని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో... చంద్రబాబు లాంటి వ్యక్తి జైల్లో ఉంటే అన్నం తినబుద్ది కావడం లేదని చెప్పుకున్న గణేష్... చంద్రబాబును అభిమానించే వాళ్లం అని చెప్పుకొనే వారికి చీము నెత్తురు ఉంటే బయటకు వచ్చి నిరసన చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా... చంద్రబాబు కోసం కేబీఆర్ పార్క్ లోనో, రింగు రోడ్డుపైనో, అమెరికాలోనో కాకుండా.. హైదరాబాద్ లో ఉద్యోగాలు వదిలసి ఎవరి ఊళ్లకు వాళ్లం వెళ్లి సొంత ఉరిలో ధర్నాలు, నిరసనలూ చేద్దాం అంటూ బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. "చంద్రబాబు కోసం ర్యాలీలు, ధర్నాలు చేస్తే చంపుతారా? చంపాలంటే చంపుకోండి.. చంద్రబాబు జైల్లో పెట్టిన దాని కంటే ఎక్కువేం కాదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమవాళ్లకు సిగ్గు లేదని చెప్పిన బండ్ల... మరో కమ్యునిటీ నాయకుడెవరైనా అరెస్ట్ అయితే ఈ పాటికి వేరేగా ఉండేదని అన్నారు! తాను కాంగ్రెస్ పార్టీ వాడినైనప్పటికీ చంద్రబాబు అరెస్ట్ తనను కలిచి వేసిందని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు.
కాగా... చంద్రబాబు అరెస్ట్ పై సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు, నిర్మతలు నట్టికుమార్, అశ్వినీదత్ లు సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అంటూ కె.ఎస్.రామారావు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ ఒక లేఖ రాశారు. జగన్ మోహన్ రెడ్డిని దింపేసి రాష్ట్రపతి పాలన విధించేయాలని సూచించారు.
ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని.. చంద్రబాబు అరెస్ట్ పై ఇండస్ట్రీ స్పందించలేదని అనడం పొరపాటని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇండస్ట్రీ స్పందించలేదని సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ వల్ల కడుపు మండిపోతుందంటూ తాజాగా బండ్ల గణేష్ స్పందించారు.