Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ లో 11వేల కార్మికులపై కేసులు.. భారత్ కు మరో కొత్త సమస్యా?

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో గార్మెంట్ పరిశ్రమ కీలకం. అదెంత అంటే.. ఆ దేశ ఎగుమతుల్లో 84 శాతం గార్మెంట్ ఎగుమతుల మీదే ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 3:53 AM GMT
బంగ్లాదేశ్ లో 11వేల కార్మికులపై కేసులు.. భారత్ కు మరో కొత్త సమస్యా?
X

మనకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు కొత్త ఆందోళనకు కారణంగా మారుతున్నాయి. ఆ దేశంలోని వస్త్రపరిశ్రమల్లో పని చేసే వేలాది కార్మికులు తమ కనీస వేతనాల్ని పెంచాలన్న డిమాండ్ చేస్తూ.. సమ్మెబాట పట్టటం తెలిసిందే. బంగ్లాదేశ్ లోని గార్మెంట్ పరిశ్రమలో దాదాపు 40 లక్షల మంది కార్మికులు వేతనాలు పెంచాలంటూ రోడ్డెక్కిన వైనంతో అక్కడ హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో గార్మెంట్ పరిశ్రమ కీలకం. అదెంత అంటే.. ఆ దేశ ఎగుమతుల్లో 84 శాతం గార్మెంట్ ఎగుమతుల మీదే ఉంటుంది. కరోనా నుంచి ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో లక్షలాది మంది కార్మికులకు అరకొర జీతాలు ఇవ్వటంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నెలకు రూ.పది వేల కంటే (మన రూపాయిల్లో) తక్కువ జీతాలు ఇవ్వటం.. ఆ వేతనాన్ని మన రూపాయిల్లో రూ.17వేలకు పెంచాలన్న ప్రధాన డిమాండ్ తో సమ్మె చేస్తున్నారు.

అంతేకాదు.. పని ప్రదేవాల్లో సరైన వెంటిలేషన్ లేని కారణంగా.. పరిశ్రమల్లోని విషవాయువుల్ని పీల్చి చాలామంది కార్మికులు అనారోగ్యానికి గురవుతున్న వైనంపైనా ఆందోళన నెలకొంది. కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండటం.. వారు పలు సమస్యలతో పాటు లైంగిక హింసకు తరచూ గురవుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అయితే.. వీటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటంతో వారు సమ్మె చేస్తున్నారు. నిరసనకారుల నిరసన హింసగా మారటంతో దాదాపు 11 వేల మంది కార్మికులపై కేసులు నమోదు చేయటంతో పాటు.. దేశంలోని 150కు పైగా ఫ్యాక్టరీలు నిరవధికంగా మూసేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

బంగ్లాదేశ్ లో పేరెన్నికన్న వస్త్ర కంపెనీలు బోలెడన్ని ఉన్నాయి. లెవీస్.. గ్యాప్.. పుమా.. హెచ్ అండ్ ఎం లాంటి ప్రముఖ కంపెనీలెన్నో తమ ఫ్యాక్టరీల్ని ఆ దేశంలో నిర్వహిస్తున్నారు. తాజాగా జరుగుతున్న సమ్మె అంతకంతకూ తీవ్రమవుతుందన్న వాదన వినిపిస్తోంది. అదే జరిగితే.. ఆ దేశంలోని వస్త్రపరిశ్రమ మూసివేతకు గురైతే.. వస్త్రాల ధరలు భారీగా పెరగటం ఖాయమంటున్నారు. ఇది.. భారత్ తో సహా ఆసియాలోని పలు దేశాలకు కొత్త సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. లక్షలాది మంది ఉపాధి అవకాశాలు తగ్గినప్పుడు.. దాని ప్రభావం ఇతర దేశాల మీద పడటంతో పాటు.. ధరల పెరగుదల.. ద్రవ్యోల్బణానికి కారణమవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే జరుగుతున్న యుద్ధాలతో ఇబ్బంది పడుతున్న వేళ.. బంగ్లాదేశ్ లో మొదలైన బంద్ మరిన్ని సమస్యలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.