'స్మార్ట్ ఫోన్ జాంబీలు.. జాగ్రత్త..' రోడ్లపై భారీ బోర్డులు ఏంటి కథ?
సీటు బెల్టు లేకుండా కారు నడపొద్దు.. హెల్మెట్ లేకుండా.. వాహనం నడపొద్దు వంటివాటినే మని ఇప్పటి వరకు చూశాం.
By: Tupaki Desk | 23 Jan 2024 12:12 PM GMT'స్మార్ట్ ఫోన్ జాంబీలు.. జాగ్రత్త..' అంటూ.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రధాన రహదారులపై కొత్తగా భారీ ఎత్తులో పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తు న్నాయి. వీటిని ట్రాఫిక్ పోలీసులే ఏర్పాటు చేశారు. అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. సాధారణంగా.. ట్రాఫిక్‌విషయానికి వస్తే.. వాహనం నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడొద్దు.. మద్యం తాగి వాహనాలు నడపొద్దు.. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించొద్దు. సీటు బెల్టు లేకుండా కారు నడపొద్దు.. హెల్మెట్ లేకుండా.. వాహనం నడపొద్దు వంటివాటినే మని ఇప్పటి వరకు చూశాం.
కానీ, బెంగళూరు పోలీసులు ఈ జాబితాలో తాజాగా 'స్మార్ట్ ఫోన్ జాంబీలు.. జాగ్రత్త..'అంటూ కొత్త విషయాన్ని చేర్చేశారు. దీని అర్ధం.. మీరు ప్రయాణిస్తున్న దారిలో స్మార్టు ఫోన్‌లో చాట్‌చేస్తూ.. ఏమాత్ర పరసరాలపై దృష్టిపెట్టకుండా.. సాగిపోయే వారు ఉంటారు.. వారి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండండి.. ప్రమాదాలకు గురి కాకండి అని హెచ్చరించడమే. ఇటీవల కాలంలో బెంగళూరు వీధుల్లో రోడ్లు దాటుతున్నవారు.. రహదారులపై నడుస్తున్న వారు.. రోడ్డును చూడకుండా.. తమ దృష్టంగా సెల్ ఫోన్లపైనే పెడుతున్నారు. దీంతో రహదారి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
గత నెలలో ఒక యువతి ఇలానే సెల్‌ఫోన్‌లో ఏవో చాటింగులు చేసుకుంటూ.. ఎదురుగా దూసుకు వస్తున్న కారును ఏమాత్రం గమనించకుండా రోడ్డు దాటేస్తోంది. ఈ క్రమంలో తృటిలో ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడంతో ఆమె చిన్నపాటి ప్రమాదంతో బతికి బయటపడింది. ఈ ఘటన తర్వాత.. ట్రాఫిక్ పోలీసులు.. ఇలా.. 'స్మార్ట్ ఫోన్ జాంబీలు.. జాగ్రత్త..'అని రహదారులపై పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు.. రహదారుల వెంట ప్రయాణికులకు పోలీసులు అవగాహన కూడా కల్పిస్తున్నారు. కనీసం రోడ్డుపై నడిచేప్పుడు, లేదా రోడ్డు దాటేటప్పుడైనా.. సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టాలని వారు సూచిస్తున్నారు.