బెంగళూరులో రోజుకు నీటి ఖర్చు రూ.500?
ఈ నీటి కష్టాల్ని ఎదుర్కోలేని వారు పెద్ద సంఖ్యలో బెంగళూరు మహానగరాన్ని వదిలిపెట్టి.. సొంతూర్లకు వెళుతున్నారు.
By: Tupaki Desk | 20 March 2024 4:28 AM GMTవాతావరణ పరిస్థితులు ఒకవైపు.. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి బెంగళూరు మహానగరంలో బతుకుతున్న లక్షలాది మందికి జీవితం దుర్భరంగా మారింది. తాగునీటి కష్టాలతో వారు విలవిలలాడిపోతున్నారు. గడిచిన కొద్ది నెలలుగా నీటి కష్టాలు ఎక్కువ కావటం.. ఇప్పుడు తీవ్రమైన పరిస్థితి. బెంగళూరు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు సినిమా కష్టాలకు మించి ఉంటున్నాయి. పొద్దున్నే లేచింది మొదలు ఆ రోజు అవసరాలకు సరిపడా నీళ్లను సొంతం చేసుకోవటం ఇప్పుడో పెద్ద సమస్యగా మారింది.
ఈ నీటి కష్టాల్ని ఎదుర్కోలేని వారు పెద్ద సంఖ్యలో బెంగళూరు మహానగరాన్ని వదిలిపెట్టి.. సొంతూర్లకు వెళుతున్నారు. ఉద్యోగాల్ని వర్కు ఫ్రం హోం అడిగి తీసుకుంటున్నారు. ఈ గార్డెన్ సిటీలో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారి కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే బెంగళూరులో నీటికి సంబంధించి బోలెడెన్ని రూల్స్ ఇప్పుడు అమలవుతున్నాయి. నీటిని ఏ మాత్రం వేస్టు చేసినా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే నీటి వినియోగంపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమలవుతున్నాయి.
నీళ్ల ట్యాంకర్లను బుక్ చేస్తే ఎన్నిరోజులకు వస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇలాంటివేళ.. కొన్ని కుటుంబాల వారు రోజుకు రూ.500 ఖర్చు చేస్తే తప్పించి బెంగళూరు నీటి కష్టాలనుంచి బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు.. అనేక అపార్టుమెంట్లలో నీటి రేషన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. నీటి కోసం 25 లీటర్ల వాటర్ బాటిళ్లను చేతబట్టిన పలువురు ఆర్ వో కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
బెంగళూరు నీటి కష్టాల ఎపిసోడ్ లో సిద్దరామయ్య సర్కారుకు భారీ డ్యామేజ్ జరిగిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాగునీటి కొరత అంశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు పూర్తిగా ట్యాంకర్ల మాఫియాకు లొంగిపోయారంటూ రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. నీటి కోసం బెంగళూరు సామాన్యులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. జూన్ వర్షాలు పడే వరకు ఈ తిప్పలు తప్పని పరిస్థితి.