బంగ్లాకు పెను ప్రమాదం పొంచి ఉందా? ఆ దేశ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ లోని రాజకీయ పార్టీలను ఉద్దేస్తూ.. రాజకీయ నేతలు తమలో తాము పోట్లాడుకోవద్దని.. ఈ అంతర్గత పోరు దేశ సార్వభౌమత్వానికి పెనుముప్పు కలిగిస్తుందంటూ వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 26 Feb 2025 4:56 AM GMTఅనూహ్యరీతిలో బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి తెలిసిందే. మైనార్టీ వర్గాలపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడటం.. భారత వ్యతిరేకత అంతకంతకూ ఎక్కువైపోవటమే కాదు.. హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ శ్రేణుల్ని టార్గెట్ చేసుకొని మరీ ప్రతీకార దాడులు.. విధ్వంస కార్యకలాపాలు జరుగుతున్న వైనంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్ లోని రాజకీయ పార్టీలను ఉద్దేస్తూ.. రాజకీయ నేతలు తమలో తాము పోట్లాడుకోవద్దని.. ఈ అంతర్గత పోరు దేశ సార్వభౌమత్వానికి పెనుముప్పు కలిగిస్తుందంటూ వ్యాఖ్యానించారు. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని.. నేరస్థులు దీన్ని అనుకూలంగా మలుచుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతల క్షీణతకు కొన్ని కారణాలు ఉన్నట్లుగా పేర్కొన్న ఆయన.. ‘మనమంతా గొడవల్లో నిమగ్నమై ఉన్నాం. మనలో మనమే పోట్లాడుకుంటున్నాం. విభేదాల్ని పక్కన పెట్టకుండా అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం.. ఘర్షణలకు దిగటం ద్వారా దేశ స్వాతంత్ర్యం.. సౌర్వభౌమాధికారం ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి పరిస్థితులను దుండగులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.
బంగ్లాదేశీయులంతా ఐక్యంగా ఉండి దేశాన్ని కాపాడుకోవాలన్న ఆయన.. తాను ఈ విషయాన్ని మళ్లీ.. మళ్లీ హెచ్చరిస్తున్నానని పేర్కొన్నారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నోటి నుంచి షాకింగ్ వ్యాఖ్యలు వచ్చాయి. తానిప్పుడే హెచ్చరిస్తున్నాని.. ఆ తర్వాత తాను అప్రమత్తం ఎందుకు చేయలేదని తనను భవిష్యత్తులో అనొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు ఎలాంటి వ్యక్తిగత ఆశలు.. ఆశయాలు లేవన్న ఆర్మీ చీఫ్.. ‘దేశాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ పై విశ్రాంతి తీసుకుంటా. సైన్యం సైతం తమ బ్యారక్ లకు వెళ్లిపోతుంది. దేశంలో ఎన్నికల నిర్వహణకు 18నెలలు పడుతుందని గతంలోనే చెప్పా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం’ అని పేర్కొన్నారు. మరి.. తమ దేశ ఆర్మీచీఫ్ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్ నేతలు ఏ మాత్రం సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.