బంగ్లాదేశ్ లో ఆగని రచ్చ.. ఎంత తీవ్రమంటే?
రెండు మూడు రోజలుుగా అవామీ లీగ్ పార్టీ మీద ఆందోళనకారులు చేస్తున్న దాడులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి.
By: Tupaki Desk | 8 Feb 2025 5:00 AM GMTఒక రాజకీయ పార్టీ మీద వ్యతిరేకత ఎంతవరకు వెళుతుంది? సదరు పార్టీ అధికార పక్షమైతే ఎన్నికల్లో ఓటమి వరకు వెళుతుంది. కొంతకాలం ఆ పార్టీ మీద వ్యతిరేకత కంటిన్యూ అవుతుంది. కానీ.. బంగ్లాదేశ్ లో సీన్ మాత్రం వేరేగా ఉంది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైన పార్టీగా దశాబ్దాల తరబడి బంగ్లాదేశీయుల మనసుల్ని దోచుకున్న అవామీ లీగ్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం విస్మయానికి గురయ్యేలా మారింది.
రిజర్వేషన్ల విషయంలో మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహరించిన తీరుతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మొదలైన ఆందోళన.. ఆమె ప్రభుత్వాన్ని మునిగిపోయేలా చేయటమే కాదు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత్ కు వచ్చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింస.. రచ్చ ఒక కొలిక్కి రాక ముందే.. తమ పార్టీ నేతలతో ఆందోళన నిర్వహించాలన్న ఆమె తాజా పిలుపు.. ఇప్పుడు కొత్త హింసకు తెర తీసింది. రెండు మూడు రోజలుుగా అవామీ లీగ్ పార్టీ మీద ఆందోళనకారులు చేస్తున్న దాడులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి.
దాదాపు 24 జిల్లాల్లో బంగబంధు ముజిబుర్ రెహమాన్ కుడ్య చిత్రాల్ని తొలగించటమే కాదు.. ఆ పార్టీ నేతల ఇళ్లను.. ఆస్తుల్ని దోచేస్తున్నారు. వారిపై దాడులు జరుగుత్నాయి. ఆ పార్టీకి చెందిన వారి ఇళ్లను తగలబెట్టేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ప్రస్తుతం భారత్ లో తల దాచుకుంటున్న షేక్ హసీనా.. బుధవారం రాత్రి పార్టీ నేతల్ని ఉద్దేశించి సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రసంగంపై ఆందోళన మొదలై అధి కాస్తా విధ్వంసంగా మారింది. అది మూడు రోజలుగా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. శుక్రవారం ఈ హింస మరింత ఎక్కువైంది. శుక్రవారం తెల్లవారుజామున ఢాకాలోని బనానీ ప్రాంతంలోని అవామీలీగ్ అధ్యక్ష మండలి సభ్యుడు షేక్ సలీం ఇంటిని తగలబెట్టారు. పలుచోట్ల ఇళ్లు దోచుకోవటం.. అనంతరం నిప్పు పెడుతున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.. ఈ విధ్వంసాన్ని ఆపాలని.. చట్టాన్ని గౌరవించి దేశంలో శాంతిని పునరుద్ధరించాలని మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం ఆందోళనకారుల్ని కోరినా.. మార్పు రాకపోవటం గమనార్హం. ఇదంతా చూస్తే.. బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేకతతో పాటు.. షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఉనికి లేకుండా చేయాలన్న వ్యూహం పక్కాగా అమలవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి హింసకు పాల్పడే వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటే.. ఇలాంటి పరిస్థితులు ఇంతకాలం కొనసాగుతాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.