Begin typing your search above and press return to search.

నిజమా? ప్రభుత్వ కుట్రనా? హసీనాకు ఎదురెళ్తే.. బంగ్లాలో శాల్తీ మాయం?

అసలే భారత వ్యతిరేకి, హసీనాకు బద్ధ శత్రువు అయిన యూనస్.. గత ప్రభుత్వంలోని విషయాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 2:30 PM GMT
నిజమా? ప్రభుత్వ కుట్రనా? హసీనాకు ఎదురెళ్తే.. బంగ్లాలో శాల్తీ మాయం?
X

పాలకులు ఎక్కడైనా పాలకులేనా? వారికి పదేపదే అధికారం దక్కితే నియంతలుగా మారిపోతారా? తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలనే బానిసలుగా చూస్తారా? ఎదురుతిరిగిన వారిని ఖతం పట్టిస్తారా? అది ప్రజాస్వామ్యమైనా? నియంత పాలనైనా..? సైనిక ప్రభుత్వమైనా? అంతేనా? బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విడుదల చేస్తున్న వివరాలు దీనిని అవుననే చెబుతున్నాయి. గత ఆగస్టు 4 వరకు బంగ్లాదేశ్ లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే, స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన హింస, ఆందోళనలతో ఆమె పదవిని వీడారు.

అప్పటినుంచి భారత్ లోనే..

హసీనా ఆగస్టు 4 నుంచి భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దిగిపోయాక ఆ దేశంలో నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అసలే భారత వ్యతిరేకి, హసీనాకు బద్ధ శత్రువు అయిన యూనస్.. గత ప్రభుత్వంలోని విషయాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

ఆ మిస్సింగ్ వెనుక హసీనా?

బంగ్లాలో వరుసాగా నాలుగోసారి మొన్న జనవరిలో హసీనా ప్రధానిగా గెలిచారు. 2009 నుంచి ఆమెనే అధికారంలో ఉన్నారు. ఈ సమయంలో బంగ్లాలో అనేకమంది వ్యక్తుల అదృశ్యం, హత్యల వెనుక హసీనా ప్రమేయం ఉందని యూనస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హసీనా హయాంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల విచారణ కమిషన్‌ ఏర్పాటైంది. ‘అన్‌ఫోల్డింగ్‌ ది ట్రూత్‌’ పేరుతో ఈ కమిటీ మధ్యంతర నివేదికను యూనస్‌ కు ఇచ్చింది. ఇందులో వ్యక్తుల అదృశ్యం ఘటనల్లో హసీనా పాత్ర ఉన్నట్లు తేల్చింది కమిషన్. ఆమె రక్షణ సలహాదారు, మాజీ మేజర్‌ జనరల్‌ అహ్మద్‌ సిద్ధిఖ్‌ సహా కొందరు ఉన్నతాఅధికారులకూ ఈ అక్రమంలో పాత్ర ఉందని పేర్కొంది.

3,500 మంది పైనే..

బంగ్లాలో హసీనా హయాంలో అదృశ్యమైన వారి సంఖ్య 3,500 పైగానే ఉన్నట్లు కమిషన్‌ సభ్యుడు సజ్జాద్‌ హుస్సేన్‌ తెలిపారు. మొత్తం 1,676 ఫిర్యాదులు నమోదు చేయగా.. 758 పరిశీలించినట్లు చెప్పారు. 200 మంది ఇంతకూ తిరిగి రాలేదని.. వచ్చినవారిలో చాలామంది జైళ్లలో బందీలుగా గడిపారని వివరించారు.

ఢాకా శివార్లలో నిర్బంధ కేంద్రాలు కమిషన్.. బంగ్లా రాజధాని ఢాకా శివార్లలో ఎనిమిది రహస్య నిర్భంద కేంద్రాలను గుర్తించిందట. కాగా, వచ్చే మార్చిలో రెండో మధ్యంతర నివేదిక ఇవ్వనుంది ఈ కమిషన్. చాలా ఆరోపణలు వచ్చాయని, వాటిని పరిశీలించేందుకు ఏడాది సమయం కావాలని కోరుతోంది.

హసీనా పట్ల యూనస్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. ఆమెపై ఇప్పటికే 50పైగా కేసులు నమోదు చేసింది. దీంతోనే తాజా నివేదికను నమ్మేందుకు వీలు లేదు. కేవలం కుట్ర కేసులు మోపి.. హసీనాను మళ్లీ స్వదేశం రాకుండా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.