Begin typing your search above and press return to search.

అల్లర్లు..హత్యలు..అంతా ఆ యూనసే చేశారు..హసీనా సంచలన ఆరోపణలు

సరిగ్గా 4 నెలల కిందట వరకు ఆమె ప్రపంచంలో ఓ దేశానికి కీలక నాయకురాలు. వరుసగా మూడోసారి ఎన్నికైన ఘనమైన రికార్డు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 6:54 AM GMT
అల్లర్లు..హత్యలు..అంతా ఆ యూనసే చేశారు..హసీనా సంచలన ఆరోపణలు
X

సరిగ్గా 4 నెలల కిందట వరకు ఆమె ప్రపంచంలో ఓ దేశానికి కీలక నాయకురాలు. వరుసగా మూడోసారి ఎన్నికైన ఘనమైన రికార్డు. పొరుగున ఉన్న పెద్ద భారత దేశం నుంచి పూర్తి అండ. కానీ, ఆగస్టు 4న అన్నీ మారిపోయాయి. పెద్దఎత్తున జరిగిన తిరుగుబాటు కారణంగా ఉన్నపళంగా దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇదంతా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురించి. నాలుగు నెలలుగా ఆమె భారత్ లోనే ప్రవాస జీవితం గడుపుతున్నారు.

భారత గడ్డపై నుంచి గళం..

ఆగస్టు 4న ఢాకా నుంచి నేరుగా ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ చేరుకున్న హసీనా.. ఇప్పుడు భారత్ లోనే ఉన్నారు. గుర్తుతెలియని ప్రదేశంలో ఉన్న ఆమె ఇటీవలి కాలంలో రెండోసారి గళం వినిపించారు. కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడుల విషయమై మాట్లాడారు. తాజాగా తాను పదవి నుంచి దిగిపోవడానికి జరిగిన పరిణామాలను వివరించారు.

అంతా యూనసే చేశారు..

స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ కొనసాగింపు అంశం బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్తతలకు, హత్యలు, అల్లర్లు, హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిందని అంతా భావిస్తున్నారు. కానీ, హసీనా మాత్రం వీటి వెనుక ఉన్నది మొహమ్మద్‌ యూనసే అని ఆరోపించారు. హసీనా దిగిపోయాక తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ నియమితులైన సంగతి తెలిసిందే.

వర్చువల్ గా సమావేశానికి హాజరు..

అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన అవామీ లీగ్‌ కార్యకర్తలు, నేతల కార్యక్రమానికి తాజాగా హసీనా వర్చువల్‌ గా హాజరయ్యారని సమాచారం. ఆ సమయంలోనే యూనస్‌ పై కీలక ఆరోపణలు చేశారు. కాగా, హసీనాపై, అవామీ లీగ్ నేతలు, ప్రముఖ క్రికెటర్ షకిబుల్ హసన్ తదితరులపై మూక హత్యలకు కారణం అంటూ కేసులు నమోదయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. బంగ్లాదేశ్ లో

విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలకు కుట్ర పన్నిందే మహమ్మద్‌ యూనస్‌ అని హసీనా న్యూయ్యార్క్ కార్యకర్తలతో అన్నారు. బంగ్లాలో ప్రస్తుత పరిణామాలను ఆమె వివరించారు. టీచర్లు, పోలీసుపైనా దాడులు జరుగుతున్న వైనాన్ని గుర్తుచేశారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారని.. ప్రార్థనా మందిరాలపై దాడులు చేస్తున్నారని.. వీటి వెనుక మాస్టర్ మైండ్ యూనసేనని హసీనా ధ్వజమెత్తారు.

నా పదవి కాదు.. ప్రజల ప్రాణాలు ముఖ్యం

తన ప్రభుత్వంపై జరిగిన తిరుగుబాటును అరగంటలో అణచివేసే దానినని.. భద్రతా సిబ్బంది కాల్పులు జరిపితే వందల ప్రాణాలు పోయేవని హసీనా పేర్కొన్నారు. తన తండ్రి ముజిబుర్ రెహ్మాన్ లాగే తననూ హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. ప్రజల ఊచకోత కంటే.. తాను పదవిని వదులుకోవడమే సరైనదిగా భావించినట్లు చెప్పారు. అందుకే దేశం విడిచి వచ్చేశానని తెలిపారు.