Begin typing your search above and press return to search.

షేక్ హసీనాను అప్పగింత ఇష్యూ...మోడీ సర్కార్ ఏం చేస్తుంది ?

ఆమె భారత్ కి వచ్చి దాదాపు అయిదు నెలలు కావస్తోంది.

By:  Tupaki Desk   |   26 Dec 2024 4:12 AM GMT
షేక్ హసీనాను అప్పగింత ఇష్యూ...మోడీ సర్కార్ ఏం చేస్తుంది ?
X

ఒకనాడు బంగ్లాదేశ్ ని విజయవంతంగా పాలిస్తూ భారత్ కి రాచ మర్యాదలతో గౌరవప్రదమైన అతిధిగా వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ రోజు భారత్ లో తలదాచుకుంటున్నారు. ఆమె భారత్ కి వచ్చి దాదాపు అయిదు నెలలు కావస్తోంది. ఆమెని పదవీచ్యుతురాలిని చేసింది అక్కడ అంతర్యుద్ధం.

అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏలుబడిలోకి బన్ల్గాదేశ్ వెళ్ళిపోయింది. తాత్కాలిక ప్రభుత్వం భారత్ తో శత్రువు మాదిరిగా వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటు వెనక భారత్ పోరాటం ఏమీ పెద్దగా లేదని తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న వారు కానీ అక్కడ రాజకీయ నాయకులు కానీ అంటూ భారత్ పట్ల తమ ద్వేషాన్ని చాటుకుంటున్నారు

ఈ రోజుకీ బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు ఆగడంలేదు. దేవాలయాల విధ్వంసం కూడా సాగుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు అసలైన అగ్ని పరీక్షగా మోడీ సర్కార్ ముందు ఒకటి వచ్చి పడింది. భారత్ లో ఉంటున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని తాజగా బంగ్లాదేశ్ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ వచ్చింది.

దీనిని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ తౌహిద్ హుస్సేన్ అధికారికంగా ధృవీకరించారు. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి పంపాలని దౌత్య ప్రక్రియ ద్వారా భారత ప్రభుత్వానికి సందేశం పంపామని ఆయన చెప్పారు. తమ దేశానికి ఆమె కనుక వస్తే తాము మెను ప్రాసిక్యూట్ చేయాలనుకుంటున్నామని కూడా స్పష్టం చేశారు. అందువల్ల ఆమె బంగ్లాకు తిరిగి రావాలని డిమాండ్ చేస్తున్నామని కూడా చెప్పారు.

మరో వైపు చూస్తే ఈ ఏడాది అక్టోబర్ 17న బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ ఉత్తర్వును అమలు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. అంతే కాదు బంగ్లాదేశ్ భారత్ ల మధ్య ఉన్న పరస్పర అప్పగింతల ఒప్పందాల మేరకు మాత్రమే షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని కోరుతున్నామని చెబుతోంది.

ఈ అప్పగింతల ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య నేరస్తులను అప్పగించుకునేందుకు వీలుంది. 2013లో ఈ ఒప్పందం ఆనాటి యూపీఏ ప్రభుత్వం బంగ్లా ప్రభుత్వం ల మధ్య కుదిరాయి. ఆ సమయంలో బంగ్లాకు ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఉన్నారు. మరి ఇపుడు అదే ఒప్పందం చూపించి ఆమెను బంగ్లాదేశ్ కి పంపించాలని కోరుతున్నారు.

అయితే ఈ అప్పగింతల ఒప్పందంలో నేరస్తులు హత్యలు చేసిన వారు ఇతరమైన దారుణాలకు పాల్పడిన వారిని మాత్రమే పరస్పరం అప్పగించుకోవాలని ఉంది అని అంటున్నారు. అంతే తప్ప రాజకీయ నేరాలు లేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈ అప్పగింతల ఒప్పందం వర్తించదని అంటున్నారు. ఒప్పందంలోకి ఆర్టికల్ 6 ప్రకారం ఒకరిని అప్పగించలేని పరిస్థితులు కూడా ఆయా దేశాలు పేర్కొనవచ్చు అని అంటున్నారు.

మరి దీని ప్రకారం చూస్తే భారత్ షేక్ హసీనాను వెనక్కి పంపించకపోవచ్చు అని అంటున్నారు. ఈ రోజున చూస్తే బంగ్లాదేశ్ భారత్ మీద విషం చిమ్ముతోంది. హసీనా పాలనలో భారత్ తో మంచి సంబంధాలు ఉండేవి. అందువల్ల భారత్ బంగ్లాలో పరిస్థితులు గమనిస్తోంది. అవి సర్దుబాటు అయ్యేలా చూడాలని అనుకుంటోంది.

ఇక 2025 జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయబోతున్నారు. ఆయన బంగ్లాదేశ్ వ్యవహారాల మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు. షేక్ హసీనా పట్ల ఆయనకు సానుభూతి ఉందని అంటున్నారు. దాంతో అమెరికా ఆలోచనలు అన్నీ చూసిన మీదట భారత్ దౌత్య పరంగా లేక ఇతర మార్గాల ద్వారా బంగ్లాదేశ్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది అని అంటున్నారు. అందువల్ల బంగ్లాదేశ్ కోరిన వెంటనే షేక్ హసీనాను ఇప్పట్లో పంపించకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.