Begin typing your search above and press return to search.

బంగ్లా క్రికెట్ బంతాట.. కెప్టెన్ ఇల్లు కాలి బూడిద.. ఎంపీల భవితవ్యం ఏమిటో?

ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్టుగా ఎదుగుతున్న బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది

By:  Tupaki Desk   |   6 Aug 2024 10:30 AM GMT
బంగ్లా క్రికెట్ బంతాట.. కెప్టెన్ ఇల్లు కాలి బూడిద.. ఎంపీల భవితవ్యం ఏమిటో?
X

ప్రపంచ క్రికెట్ లో బలమైన జట్టుగా ఎదుగుతున్న బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 15 ఏళ్లుగా బంగ్లా ప్రయాణం దినదినం పెరుగుతూ వచ్చింది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి పెద్ద జట్లను గెలిచేసింది. ఐసీసీ ట్రోఫీల్లోనూ సంచలన ప్రదర్శనలు చేస్తోంది. ముఖ్యంగా టి20లు, వన్డేల్లో బలమైన జట్టుగానే ముద్ర వేసుకుంది. టెస్టుల్లోనూ కొన్నేళ్లలో ఎదగడం ఖాయం. కానీ, ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితి.

క్రికెట్ లో ఉంటూనే రాజకీయం

బంగ్లా జాతీయ జట్టు క్రికెటర్లు ఓవైపు అంతర్జాతీయంగా ప్రాతినిధ్యం వహిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి కాలుపెట్టారు. మరీ ముఖ్యంగా నిన్నటివరకు అధికారిక పార్టీ అయిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. వీరందరూ ప్రముఖ క్రికెటర్లే కావడం గమనార్హం. మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్ రౌండర్ అయిన షకిబుల్ హసన్, మాజీ కెప్టెన్ మేటి పేసర్ అయిన మొష్రఫె మొర్తజా, ఇటీవలి టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన మొష్రఫె మొర్తజా ఈ ముగ్గురూ అవామీ లీగ్ పార్టీ ఎంపీలే. అసలు బంగ్లాదేశ్ లో నిన్నటి వరకు ప్రతిపక్షమే లేదు కాబట్టి, 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నది అవామీ లీగ్ మాత్రమే కాబట్టి ఆ పార్టీ తరఫునే జాతీయ క్రికెటర్లు ఎంపీలుగా గెలిచారు.

షకిబ్, శాంటో ఎలాగో?

మొర్తజా ఆరేళ్ల కిందటే ఎంపీ అయ్యాడు. నరైల్ నుంచి 96 శాతం ఓట్లతో గెలిచాడు. రెండేళ్లుగా యువజన-క్రీడా కార్యదర్శి మంత్రి కూడా. అయితే, అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. కానీ, షకిబ్, శాంటో ఇంకా ఆడుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల్లో వీరి పరిస్థితి ఏమిటో తెలియాల్సి ఉంది. మరీ ముఖ్యంగా శాంటోకు చాలా కెరీర్ ఉంది. బంగ్లాలో రాజకీయాలు మారినందున వీరంతా ఎటువైపు మళ్లుతారో చూడాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయితే అది ఖలీదా జియాకు చెందిన బంగ్లా నేషనల్ పార్టీ (బీఎన్పీ)ది అయితే క్రికెటర్లకు ఇబ్బందులు తప్పవు. దీంతో రాజకీయాలను వదిలిపెట్టాల్సి ఉంటుంది.