ముక్తి వాహినిలో.. హిందూ వాహినిపై హింస.. బంగ్లాలోని 52 జిల్లాల్లో 205 దాడులు
మళ్లీ ఇప్పుడు షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయాక అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి.
By: Tupaki Desk | 11 Aug 2024 1:30 PM GMTబంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా ప్రముఖంగా వినిపించిన పేరు ముక్తి వాహిని. దీని అర్థం.. పాకిస్థాన్ నుంచి విముక్తి పొందడం. అందుకే స్వాతంత్ర్య సమరంలో పాల్గొంటున్నవారు ముక్తివాహినిగా ఏర్పడి పోరాటం చేశారు. అత్యంత చిన్నదేశమే అయినప్పికీ భారత్ సరిహద్దున ఉండే బంగ్లాదేశ్ మతపరంగా సున్నితమైనది. 1971 స్వాతంత్ర్య సమర పోరాటం అనంతరమే కాదు.. 1947లో అఖండ భారత్ విభజన సమయంలోనూ మైనారిటీలపై దాడులు జరిగాయి. అక్కడినుంచి వేలాదిగా ప్రజలు వచ్చేసి భారత్ లో స్థిరపడిపోయారు. అసలు బంగ్లాదేశ్ నుంచి వలసలు పోటెత్తుతున్నందునే అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ జోక్యం చేసుకున్నారు. బంగ్లాకు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చేలా చూశారు. మళ్లీ ఇప్పుడు షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయాక అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి.
వారంలో 200 పైనే..
గత సోమవారం బంగ్లాదేశ్ లో అల్లకల్లోలం రేగింది. హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మైనారిటీలపై 205 దాడులు జరిగాయని హిందూ సంస్థలు బయటపెట్టాయి. బంగ్లాలో మైనారిటీలు అంటే హిందువులు, బుద్ధులు, క్రౌస్తవులు. వీరంతా కలిసి యూనిటీ కౌన్సిల్ గా ఏర్పడ్డారు. మొత్తం 52 జిల్లాల్లో 200 పైగా దాడులు జరిగినట్లు తెలిపాయి. దీనిపై బంగ్లా తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనుస్‌కు లేఖ రాశాయి. తమ జీవితాలు ప్రమాదంలో పడ్డాయని.. రక్షణ కల్పించాలని కోరాయి.
నిద్ర లేని రాత్రుల్లో
ఎటువైపు నుంచి దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితుల్లో రాత్రుళ్లు జాగారం చేస్తున్నట్లు బంగ్లాలోని మైనారిటీలు తెలిపారు. నిద్ర కూడా పోకుండా ఆలయాలకు కాపలా కాస్తున్నామని.. ప్రభుత్వం స్పందించాలని కోరారు. మతపరమైన ప్రశాంతతను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. దీంతో యూనుస్ స్పందించారు. మరోవైపు బంగ్లా లో హిందువులపై దాడులను అడ్డుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కు కాంగ్రెస్ సభ్యులు శ్రీ థనేదార్, రాజా కృష్ణమూర్తి వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ పరిస్థితులన్నిటితో మైనారిటీలపై దాడులను యూనుస్ ఖండించారు. ఇలాంటివాటిని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మహిళల టి20 వరల్డ్ కప్ పరిస్థితి ఏమిటో?
బంగ్లాలో అక్టోబరులో మహిళల టి20 ప్రపంచ కప్ జరగాల్సి ఉంది. అల్లర్ల కారణంగా ఆందోళన నెలకొంది. దీంతో ఆటగాళ్ల భద్రతపై తమకు హామీ ఇవ్వాలని బంగ్లా సైన్యాధిపతికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ లో అక్టోబరు 3 నుంచి 20 వరకు టి20 ప్రపంచ కప్ జరగనుంది. సెప్టెంబరు ఆఖర్లోనే సన్నాహక మ్యాచ్ లున్నాయి. దీంతో పరిస్థితులను ఐసీసీ నిశితంగా గమనిస్తోంది.