భారత్ మీద విషం కక్కుతున్న బంగ్లాదేశ్!
బంగ్లాదేశ్ అన్నది ఈ రోజున ప్రపంచ మ్యాప్ లో ఉంది అంటే దానికి కారణం భారత దేశం.
By: Tupaki Desk | 1 Dec 2024 4:04 AM GMTబంగ్లాదేశ్ అన్నది ఈ రోజున ప్రపంచ మ్యాప్ లో ఉంది అంటే దానికి కారణం భారత దేశం. ఆ విషయం రాజకీయాల మీద అవగాహన ఉన్న వారు ఎవరైనా చెబుతారు. పాకిస్తాన్ ఏర్పడ్డాక అందులో తూర్పు పాకిస్తాన్ కి చెందిన వారి పట్ల వివక్ష చూపిస్తున్నారని వారిని అధికార పీఠం మీద కూర్చోనీయకుండా కుట్రలు చేస్తున్నారని ద్వితీయ శ్రేణి పౌరులుగా ట్రీట్ చేస్తున్నారని ఒక పాతికేళ్ల పాటు నలిగిన తరువాత వారు ప్రత్యేక దేశం డిమాండ్ అందుకున్నారు.
అలా డెబ్బై దశకం తొలి నాళ్ళలో పుట్టిన ఉద్యమం కాస్తా పాకిస్తాన్ మీద తూర్పు పాకిస్థాన్ నేతలు యుద్ధం ప్రకటిస్తే వారిని అణచేందుకు పాకిస్తాన్ సహజంగానే తన ప్రయత్నాలను చేసింది. అప్పటికే చాలా వరకూ అణచేస్తూ అన్యాయం చేస్తూంటే తూర్పు పాకిస్థాన్ వారు భారత్ ని మద్దతు కోరిన మీదట నాటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ భారత జవాన్లను పంపించి పాకిస్తాన్ మీద వీరోచిత యుద్ధాన్ని చేయించారు.
ఆనాడు తూర్పు పాకిస్తాన్ వారిని ఆదుకున్నారు. భారత జవాన్లు లాహోరు దాకా వెళ్ళి మరీ పాక్ పీచమణచారు. పాకిస్తాన్ సైన్యాన్ని బంధీలుగా పట్టి తెచ్చారు. పాక్ ని ఓడించి మరీ దారికి తెచ్చారు. అలా ఏర్పడినదే బంగ్లాదేశ్. రెండేళ్ళ క్రితమే యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న బంగ్లాదేశ్ వెనక ఉన్న బలమైన శక్తి భారత్.
ఈ రోజున సర్వ స్వతంత్ర దేశంగా ఉంటూ ప్రపంచంలో తలెత్తుకుని తిరుగుతోంది అంటే దానికి కారణం భారత్. ఆ విధంగా చేయడమే కాదు భారత్ ఆర్ధికంగా ఇతరత్రా బంగ్లాదేశ్ కి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ దేశం ఇంతటి స్థాయికి రావడానికి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి భారత్ కారణం అన్నది తెలిసిన విషయం.
అలాంటి బంగ్లాదేశ్ ఈ రోజు భారత్ మీద విషం కక్కుతోంది. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అక్కడ టార్గెట్ చేసి మరీ హిందూ లీడర్ల మీద ధార్మిక సంస్థల మీద ఆధ్యాత్మికవేత్తల మీద దాడులు చేస్తున్నారు. వారి బ్యాంక్ అకౌంట్లను స్పందింపచేస్తున్నారు.
వారి మీద అన్ని రకాలుగా ఎటాక్ జరుగుతోంది. అయినా సరే బంగ్లా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అక్కడ ప్రస్తుతం ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం. దాంతో ఆ ప్రభుత్వం పూర్తిగా పాక్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు భారత్ ని శతృవుగా చూస్తోంది అన్న మాట ఉంది.
అమెరికా కొత్త ప్రెసిడెంట్ గా నెగ్గిన ట్రంప్ సైతం బంగ్లాలో హిందువుల మీద దాడులను ఖండించారు. ఇతర దేశాల వారూ రియాక్ట్ అవుతున్నారు. అయినా సరే బంగ్లాదేశ్ లో మాత్రం అంతకంతకు హిందువుల పరిస్థితి దారుణంగానే ఉంది. వారి మీద జరుగుతున్న దాడుల గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. అక్కడ జరుగుతున్నదే ఎక్కువ అని అంటున్నారు.
ఇదంతా దేని కోసం ఎవరి మెప్పు కోసం అన్న చర్చ సాగుతోంది. మత సామరస్యాన్ని కాపాడుతూ వచ్చిన షేక్ హసీనాను కూలదోసిన శక్తులే ఇపుడు తాత్కాలిక ప్రభుత్వం వెనకాల ఉండి ఆడిస్తున్నాయని వారి అసలు లక్ష్యం భారత్ అని అర్ధం అవుతోంది అంటున్నారు. భారత్ బంగ్లాదేశ్ కి ఎపుడూ శతృవు కాదు అన్నది తెలిసిందే. వారి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నదీ లేదు.
ఎవరు అక్కడ ఉన్నా భారత్ స్నేహ హస్తమే అందిస్తూ వచ్చింది. అలాంటిది భారత్ మీద పగ పెట్టడమేమిటని అంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులను ఖండించింది.
ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే విడుదల చేసిన ఈ ప్రకటనలో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. మైనార్టీలపై దాడుల అంశం మీద అక్కడి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఇస్కాన్ సంస్థ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని దత్తాత్రేయ హోసబలే డిమాండ్ చేశారు.
అంతే కాదు వరసబెట్టి జరుగుతున్న హిందువులపై దౌర్జన్యాన్ని ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక బంగ్లా దేశంలో మైనార్టీలపై జరుగుతోన్న దాడులను అరికట్టే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగించాలని కోరింది. ఈ దాడుల విషయంలో ప్రపంచ మద్దతు దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది.
మరో వైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు, భారతీయ జెండాకు అవమానం నేపథ్యంలో ఆ దేశానికి చెందిన రోగులకు చికిత్స చేసేది లేదని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి కీలక ప్రకటన చేసిది. బంగ్లాదేశీయులు భారతీయ జెండాను అవమానించారని, అక్కడి హిందువుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఇవన్నీ పక్కన పెడితే బంగ్లాదేశ్ లో హిందువుల దాడుల మీద భారత ప్రభుత్వం ఇప్పటికే ఆ దేశానికి చెప్పాల్సింది చెప్పింది. అయితే మరింతగా కృషి చేయాల్సి ఉందని అంటున్నారు. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడా కూడగట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారత్ పలుకుబడి పరపతి పెరుగుతున్న నేపధ్యంలో గిట్టని శక్తులు కొన్ని ఈ విధంగా బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేయాల్సినవి చేస్తున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా భారత్ కి ప్రపంచంలో గౌరవం మన్నన దక్కుతుంటే పొరుగున ఉన్న దేశాలు విషం కక్కుతున్నాయి. ఇది భారత్ దౌత్య నీతితోనే సరైన జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని మెధావులు సూచిస్తున్నారు.