Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక పరిణామం.. అక్కడ మాంసం ముద్దలు గుర్తింపు

బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ 53 ఏళ్ల అన్వరుల్ అజీమ్ అనర్ ను కోల్ కతాలో అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 May 2024 5:21 AM GMT
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో కీలక పరిణామం.. అక్కడ మాంసం ముద్దలు గుర్తింపు
X

బంగ్లాదేశ్ అధికార పార్టీకి చెందిన ఎంపీ 53 ఏళ్ల అన్వరుల్ అజీమ్ అనర్ ను కోల్ కతాలో అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. బంగ్లాదేశ్ లోనూ తీవ్రమైన అలజడిని రేపిన ఈ హత్యోదంతంలో ఎంపీ మాంసపు ముద్దలు.. వెంట్రుకల్నితాజాగా గుర్తించారు. ఈ కేసులో కోల్ కతా పోలీసులతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన హత్యకు గురైనట్లుగా భావిస్తున్న అపార్ట్ మెంట్ సెప్టిక్ ట్యాంకులో ఆయన మాంసం ముద్దలు.. తల వెంట్రుకల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వాటిని తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించినట్లుగా చెబుతున్నారు. డీఎన్ఏ పరీక్షల్లో తమకు లభించిన మాంసం ముద్దలు ఆయనవో కాదో తెలియనుంది. కేసు దర్యాప్తులో భాగంగా హత్యకు గురైన ప్లాట్ బాత్రూం ద్వారా రక్తం.. డ్రైనేజీ పైపుల గుండా వెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అక్కడి వారి సాయంతో పైపులైన్లు.. సెప్టిక్ ట్యాంక్ ను పరిశీలించారు. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఎంపీ అన్వరుల్ వైద్య చికిత్స కోసం కోల్ కతాకు రావటం.. ఆయన తన ఫ్రెండ్ కు చెందిన అపార్ట్ మెంట్ లో బస చేశారు.

మే 12న కోల్ కతాకు వచ్చిన ఆయన.. తర్వాత కనిపించకుండా పోవటం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కోల్ కతా పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలోనూ షాకింగ్ నిజాన్ని గుర్తించారు. ఆయన్ను హనీట్రాప్ కు గురి చేసి.. అత్యంత దారుణంగా హతమార్చినట్లుగా తేల్చారు. ఆయన ఉంటున్న అపార్టుమెంట్ లోనే గొంతు నులిమి హత్య చేసిన నిందితులు.. అత్యంత దారుణంగా హతమార్చారు.

ఈ హత్యకు కారణమైన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు కిరాతకంగా వ్యవహరించే తీరు ఉందని.. ఎంపీని హత్య చేసిన తర్వాత ఆయన శరీరాన్ని 80 ముక్కలుగా చేసి.. వాటిని పసుపులో కలిపి సిటీలోని బాగ్జోలా కాలువతో పాటు ఇతర ప్రాంతాల్లో పడేసినట్లుగా పోలీసులు చెప్పారు. అయితే.. వాటిని గుర్తించటం కష్టంగా మారింది. ఇటీవల కాలంలో కురిసన వర్షం కారణంగా ఈ మాంసం ముద్దలు కొట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో హత్య జరిగిన అపార్టుమెంట్ లో కొద్ది మాంసం ముద్దలు లభించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇందుకు తగ్ట్లే అక్కడి సెప్టిక్ ట్యాంక్ లో సోదాలు జరిపి.. చివరకు కొన్ని మాంసం ముద్దల్ని గుర్తించారు. చదివినంతనే వికారంగా కలిగించే ఈ ఉదంతం.. ఎంత కిరాతకంగా హత్య చేశారన్నది ఇట్టే అర్థమవుతుంది.