Begin typing your search above and press return to search.

చర్మం ఒలిచి, ముక్కలుగా నరికి... బంగ్లా ఎంపీ హత్యలో సూత్రధారి, పాత్రధారి వీళ్లే!

ఈ క్రమంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 May 2024 6:50 AM GMT
చర్మం ఒలిచి, ముక్కలుగా నరికి... బంగ్లా ఎంపీ హత్యలో సూత్రధారి, పాత్రధారి వీళ్లే!
X

వైద్యచికిత్స కోసం పశ్చిమ బెంగాల్‌ లోని స్నేహితుడి ఇంటికి వచ్చిన బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు రెండు దేశాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసుకు సంబంధించి మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి.

అవును... కోల్ కతా లో హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్ కేసులో హనీ ట్రాప్ ఇష్యూ తెరపైకి వచ్చీంది. ఇందులో భాగంగా... ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుడిని కోల్‌ కతా పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తుంది.

పైగా ఆ హత్య అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా అతని చర్మాన్ని ఒలిచి.. శరీరాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బెంగాల్‌ సీఐడీ అధికారులు స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... అమెరికాలో నివసించే ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న టౌన్‌ హాల్‌ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌ లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన బంగ్లా ఎంపీ.. ఆ తర్వాత తిరిగిరాలేదని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీని ఓ మహిళతో హనీట్రాప్‌ చేయించి ఆ అపార్ట్‌మెంట్‌ కి రప్పించి ఉంటారని అంటున్నారు.

పైగా.. మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలేనని.. ఫ్లాట్‌ లోకి వెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారట. అయితే ఇప్పటివరకూ ఉన్న ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే.. ఎంపీని గొంతునులిమి చంపినట్లు తెలుస్తోందని.. ఆ తర్వాత ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటం కోసమే ఆయన మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని పోలీసులు భావిస్తున్నారట.

ఇలా ముక్కలుగా నరికిన శరీర భాగాలు దుర్మాసన రాకుండా ఉండేందుకు వాటికి పసుపు కలిపి పెట్టినట్లుగా అనిపిస్తోందని.. ఈ క్రమంలో కొన్ని భాగాలను ఫ్రిజ్‌ లో పెట్టినట్లు ప్రాథమికంగా నిర్ధరించామని పోలీసులు వెల్లడిస్తున్నారని అంటున్నారు. అనంతరం ఎంపీ శరీర భాగాలను ప్లాస్టిక్‌ బ్యాగుల్లో తీసుకుని వివిధ ప్రదేశాల్లో పడేసి ఉంటారని పోలీసులు తెలిపారు.

కీలక నిందితుడు అరెస్ట్!:

ఈ కేసుకు సంబంధించి ఒక కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా భారత్‌ లోకి వచ్చిన జిహాద్‌ హవల్దార్‌ ఈ ఘటనలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు చెబుతున్నారు. ఎంపీని హత్య చేసి ఆయన మృతదేహాన్ని ఛిద్రం చేసినట్లు నిందితుడు హవల్దార్‌ అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు.

ఇక సూత్రధారి విషయానికొస్తే... ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్‌ సంతతికి చెందిన అమెరికా పౌరుడు, ఎంపీ పాత స్నేహితుడు అఖ్తరుజమాన్‌ అని.. పాత్రధారి జిహాద్‌ హవల్దార్‌ బయటపెట్టాడని అంటున్నారు. అతడి ఆదేశాలతోనే తాను ఈ పనిచేసినట్లు విచారణలో హవల్దార్‌ చెప్పాడని చెబుతున్నారు.