Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ ఎంపీ మృతదేహం కోల్‌ కతాలో గుర్తింపు... ముగ్గురు అరెస్ట్!

వైద్య చికిత్స నిమిత్తం భారత్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ మృతి చెందారు. ఇది హత్య అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 May 2024 10:10 AM GMT
బంగ్లాదేశ్  ఎంపీ మృతదేహం కోల్‌  కతాలో గుర్తింపు... ముగ్గురు అరెస్ట్!
X

వైద్య చికిత్స నిమిత్తం భారత్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ మృతి చెందారు. ఇది హత్య అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన శరీరంపై గాయాలున్నట్లు రకరకాల కథనాలు తెరపైకి వస్తున్నాయి. పక్కదేశం ఎంపీ ఇలా భారత్ కు వచ్చి మిస్ అయిపోవడం.. తర్వాత పోలీసులు గాలించడం.. ఈ సమయంలో మృతిచెందడం వైరల్ గా మారింది. ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తిగా మారింది!

అవును... చికిత్స కోసమని బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌ కు వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌.. కోల్ కతాలోని తన స్నేహితుడి ఇంట్లో దిగారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఆయన అదృశ్యమయ్యారు. అయితే ఆయన మృతి చెందినట్లు వ్యక్తిగత కార్యదర్శి అబ్దుర్ రవూఫ్‌ వెల్లడించారు. కోల్‌ కతాలోని ఖాళీ ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ వైద్య చికిత్స నిమిత్తం పశ్చిమ బెంగాల్‌ కు వచ్చారు. ఈ సమయంలో మే 12న బారానగర్‌ లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్‌ ఇంట్లో బసచేశారు. ఈ సమయంలో వెంటనే వస్తానంటూ రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లారని చెబుతున్నారు. అయితే ఆయన ఎంతసేపటికీ తిరిగిరాలేఉ!

దీంతో... స్నేహితుడితో పాటు బంగ్లాదేశ్‌ లోని ఎంపీ కుటుంబ సభ్యులు ఫోన్లు చేశారు. అయితే ఆ సమయంలో సదరు ఎంపీ ఎవరి కాల్స్‌ కు సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మే 14 నుంచి ఆయన ఫోన్‌ స్విచ్ఛాప్‌ వస్తోంది. దీంతో వెంటనే గోపాల్ బిశ్వాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అజీమ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా దృష్టికి తీసుకెళ్లారు.

ఇదే సమయంలో... భారత్‌ లోని దౌత్యవేత్తలకు సమాచారం ఇచ్చారు. నాటి నుంచి పశ్చిమ బెంగాల్‌ పోలీసులు, బంగ్లాదేశ్‌ అధికారులు ఆయన కోసం గాలించారు... ఈ రోజు ఆయన మృతదేహం లభ్యమైంది. అది హత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ ప్రయాణించిన కారును న్యూటౌన్‌ లోని ఆక్వాటికా సమీపంలో బుధవారం స్వాధీనం చేసుకున్నారు!

ప్లాన్డ్ మర్డర్!:

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ కోల్‌ కతాలో శవమై కనిపించడంపై బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ స్పందించారు. ఇందులో భాగంగా “ఇది పథకం ప్రకారం జరిగిన హత్య”గా అని అన్నారు. ఇదే సమయంలో... హంతకులందరూ బంగ్లాదేశీయులని తాము తెలుసుకున్నామని ఆయన వెల్లడించారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా స్పందించిన మంత్రి... హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. ఈ కేసుకు భారత పోలీసులు సహకరిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక డైలీ స్టార్ తెలిపింది!