Begin typing your search above and press return to search.

హై అలర్ట్.. మన ఊరికి బంగ్లాదేశీలు.. బోర్డర్ లోనూ భారీగా

విశ్వనగరంగా మారిన హైదరాబాద్ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ ఇల్లుగా మారింది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 9:12 AM GMT
హై అలర్ట్.. మన ఊరికి బంగ్లాదేశీలు.. బోర్డర్ లోనూ భారీగా
X

విశ్వనగరంగా మారిన హైదరాబాద్ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ ఇల్లుగా మారింది. ఎక్కడినుంచో వచ్చి.. ఇక్కడ పెరిగి ఇక్కడే మట్టిలో కలిసిపోయేవారు ఎందరో..? ఇప్పుడు ప్రపంచ పరిస్థితుల రీత్యా ఏ దేశంలో ఏం జరిగినా హైదరాబాద్ లో ఆ స్పందన ఉంటోంది. ఉదాహరణకు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగినప్పుడు అక్కడివారు ఇక్కడ ఎవరున్నారు? అని చూస్తే వందల మంది కనిపించారు. మొన్న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి జరిగితే హైదరాబాద్ లో ఉన్న ఇజ్రాయెల్ వాసులూ కంగారుపడ్డారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిణామాలు చూస్తుంటే.. అక్కడివారు హైదరాబాద్ వచ్చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.

వ్యవస్థలే లేవు అక్కడ..

బంగ్లాదేశ్ లో ప్రస్తుతం పోలీసింగ్ లేదు. ఎంతటి దారుణ పరిస్థితి అంటే.. మైనారిటీలపై దాడులు, వారి ఇళ్లు, దుకాణాల విధ్వంసానికి పాల్పడుతున్నారు. మరోవైపు అసలు పోలీసులే లేరు. దీంతో శాంతి భద్రతలు గాడితప్పుతున్నాయి. ఢాకా వంటి చోట్ల విద్యార్థులే రోడ్డు మీద ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. ఇక బంగ్లా నుంచి వలసలు సరేసరి. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ లోకే కాదు.. వారికి సుదూరాన ఉన్న హైదరాబాద్‌ నగరంలోకీ ప్రవేశిస్తున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని పాతబస్తీకి సమీపంలో ఉండే బాలాపూర్, కాటేదాన్, మైలార్‌ దేవ్‌ పల్లి, పహడీషరీఫ్, ఫలక్‌ నుమాల్లో ఇప్పటికే తనిఖీలు చేశారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసున్నారు. కాగా, బంగ్లాదేశ్ లో హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో 10 లక్షల మంది పైగా మయన్మార్ వెళ్లగొట్టిన రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చారు. వీరిలో కొందరు హైదరాబాద్ వచ్చేశారు. వీరేకాక బంగ్లాదేశీలు చాలామంది కూలీలుగా పనిచేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ స్థిరపడిపోయారు. అయితే, వీలున్నప్పుడు వీరు సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ కు వెళ్తున్నారు.

ఖమ్మంలోనూ బంగ్లాదేశీలు..

రెండు-మూడు నెలల కిందట తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బయటపడిన ఉదంతం వింటే షాక్ తప్పదు. కొందరు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఖమ్మంలో స్థిరపడిపోయి బిల్డింక్ కన్ స్ట్రక్షన్ కార్మికులుగా పనిచేస్తూ స్థిరపడిపోయారు. విషయం పడేసరికి వెళ్లిపోయారు. సికింద్రాబాద్‌లో ఓ మైనర్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసి ప్రశ్నించగా.. హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో బంధువులు తమను పిలిచినట్లు తెలిపారు. వీరి అరెస్టు తెలిసి.. బంధువులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్రమంగా హైదరాబాద్ చేరిన బంగ్లాదేశీలు ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసేందుకు తమవారిని రప్పిస్తున్నారు. వీరిని సరిహద్దు దాటించి రైళ్లలోకి చేర్చడం బంగ్లా, పశ్చిమబెంగాల్‌ లోని కొందరు దళారుల పని. మనిషికి రూ.5-6 వేల వరకు కమీషన్‌ తోనే వీరి పనిచేస్తున్నారు. బంగ్లా నుంచి బెంగాల్ లోని మాల్డా ద్వారా సరిహద్దు దాటి కోల్‌ కతా వచ్చి.. నకిలీ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు పొంది భారతీయులుగా మారిపోతున్నారు. రైళ్ల ద్వారా తెలంగాణకు వస్తున్నారు. రెండేళ్లలో వెయ్యిమంది వరకు ఇలా వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు బంగ్లాలో పరిస్థితుల రీత్యా వారంతా ఎక్కడున్నారు? వారిని తీసుకొచ్చిన దళారులు ఎవరనే పోలీసులు కూపీ లాగుతున్నారు.