Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ లో స్టేషన్ల నుంచి పోలీసులు పారిపోతున్నారు!

షేక్ హసీనా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడిచిన పోలీసులు.. ఇప్పుడు నిరసనకారులైన విద్యార్థుల ఆగ్రహావేశాలకు వణికిపోతున్నారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:44 AM GMT
బంగ్లాదేశ్ లో స్టేషన్ల నుంచి పోలీసులు పారిపోతున్నారు!
X

దేశం ఏదైనా పోలీసుల పాత్ర ఒకేలా ఉంటుందన్న విషయాన్ని బంగ్లాదేశ్ ఉదంతం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పుడా దేశంలోని పరిస్థితుల గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. షేక్ హసీనా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడిచిన పోలీసులు.. ఇప్పుడు నిరసనకారులైన విద్యార్థుల ఆగ్రహావేశాలకు వణికిపోతున్నారు. దేశంలోని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మూకుమ్మడిగా పోలీసులు పారిపోతున్న పరిస్థితి ఇప్పుడు ఆ దేశంలో నెలకొంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తిరుగుబాటు చేపట్టిన విద్యార్థులు.. షేక్ హసీనా పార్టీ నేతల్ని.. వారి సానుభూతిపరుల్ని.. అధికారుల్ని మాత్రమే కాదు.. న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తుల్ని వదలట్లేదు. ఇక.. పోలీసులపైనా తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు.. స్టేషన్లను నిప్పు పెట్టేసి.. అగ్నికి ఆహుతి చేస్తున్నారు. దీంతో.. మొన్నటివరకు పోలీస్ స్టేషన్లుగా ఒక వెలుగు వెలిగిన భవనాలు ఇప్పుడు కాలి బూడిద కావటమే కాదు.. గుర్తు పట్టలేనంతగా అవి మారిపోయాయి. అంతేనా.. పోలీస్ స్టేషన్ల బయట ఉన్న వాహనాల్ని సైతం పూర్తిగా కాల్చేశారు. దీంతో.. ధ్వంసమైన పోలీసు స్టేషన్లు పొగచూరి పట్టేశాయి. గుర్తించేందుక వీల్లేని విధంగా అవి తయారైనట్లుగా చెబుతున్నారు.

ఎందుకిలా జరిగింది? ఆందోళనకారుల ఆగ్రహాన్ని పోలీసులు ఇంత భారీగా ఎందుకు ఎదుర్కొంటున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు.. అందులో భాగంగా వెనుకా ముందు చూసుకోకుండా వ్యవహరించటం.. కాల్పులకు తెగబడటం.. పెద్ద ఎత్తున ప్రాణాలు పోగొట్టుకున్నారు విద్యార్థులు. దీంతో.. వారి టార్గెట్ అధికార పార్టీతో పాటు పోలీసులని కూడా చెబుతుననారు. పోలీసు స్టేషన్ల మీద దాడి నేపథ్యంలో.. స్టేషన్ లోని పోలీసులు మొత్తం తలోదిక్కుకు పారిపోతున్నారు. బతికి ఉంటే బలుశాకు తినొచ్చన్న చందంగా మారి పరిస్థితి మారినట్లు చెబుతున్నారు.

పోలీసులపై ఇంత ఆగ్రహం ఉన్న నేపథ్యంలో.. శాంతిభద్రతలను కాపాడే పోలీసు వ్యవస్థను ఎలా రిక్రియేట్ చేయాలన్నది పెద్ద సవాలుగా మారింది. దీనిపై తర్జనభర్జనలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులంతా ఒకేసారి పారిపోయిన సంఘటనలు లేవని.. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. యుద్ధ సమయాల్లో కనిపించే సన్నివేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి.

విద్యార్థుల అగ్రహా జ్వాలలకు తగలబడిపోయిన పోలీస్ స్టేషన్ల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు.. శుభ్రం చేసేందుకు వచ్చిన వారిపైనా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతలా పోలీసు వ్యవస్థపైన నమ్మకం కోల్పోయిన వేళ.. వాటిని తిరిగి పెంపొందించటం ఎలా అన్నది అతి పెద్ద సవాలుగా మారింది. పోలీస్ స్టేషన్ల మీద దాడి వేళ.. పెద్ద ఎత్తున ఆయుధాలు. మందుగుండు సామాగ్రిని దోచుకెళ్లటం.. చాలామంది పోలీసు యూనిఫాంలు కూడా తీసుకెళ్లటం గమనార్హం. ఆందోళనకారుల మద్దతుతో పోలీస్ స్టేషన్లను తిరిగి నెలకొల్పే చర్యలు మొదలైనట్లుగా తెలుస్తోంది.

ఇందులో భాగంగా పోలీసుల యూనిఫం రంగు నుంచి మార్పులు మొదలు పెట్టాలని చెబుతున్నారు. ద్వంసమైన పోలీసు వ్యవస్థను తిరిగి తయారు చేయటం సవాళ్లతో కూడుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి ఎక్కువ కాలం పడుతుందని చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు విద్యార్థులే రోడ్ల మీదకు చేరుకొని.. నియంత్రిస్తున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. అవేమీ అక్కడి పరిస్థితుల్ని మార్చలేవని.. తక్షణం కొత్త పోలీసు వ్యవస్థ అవసరంగా మారింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? విద్యార్థుల ఆగ్రహావేశాల్ని ఎవరు చల్లారుస్తారు? అన్నది అతి పెద్ద ప్రశ్నలుగా చెప్పాలి.