Begin typing your search above and press return to search.

బంగ్లాలో హిందువుల ఊచకోత?... భారతీయుల పరిస్థితిపై కేంద్రం క్లారిటీ!!

బంగ్లాదేశ్ లో గతకొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు తారాస్థాయికి చేరాయి.

By:  Tupaki Desk   |   6 Aug 2024 6:34 AM GMT
బంగ్లాలో హిందువుల ఊచకోత?... భారతీయుల పరిస్థితిపై కేంద్రం క్లారిటీ!!
X

బంగ్లాదేశ్ లో గతకొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ఈ నేపథ్యంలో... హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె భారత్ కు చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడున్న హిందువులు, భారతీయుల పరిస్థితి ఏమిటి, ఇప్పుడెలా ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ప్రస్తుతం బంగ్లాలో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది.. ఇదే క్రమంలో అక్కడున్న హిందువుల పరిస్థితి ప్రస్తుతం ఏమిటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా... వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... క్షేత్రస్థాయిలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయని, ఇక్కడ హిందువులను ఊచకోత కోస్తున్నారని తెలిపింది.

బంగ్లాలో ఇప్పుడు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలయ్యాయని అంటున్నారు. ఈ మేరకు అధికర అవామీ లీగ్ పార్టీ నేతలతో పాటు దేశంలోని హిందువులు, వారి ఆస్తులపైనా దాడులు తీవ్రమయ్యాయని చెబుతున్నారు. ఈ సందర్భంగా... ఆల్ ఐఎస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి!

ఈ సందర్భంగా... బంగ్లాదేశ్ లో నిజంగా విద్యార్థుల హక్కులు, రిజర్వేషన్లు గురించి.. షేక్ హసీనా పరిపాలనకు వ్యతిరేకంగానూ నిరసనలు తెలుపుతుంటే... ఈ మధ్యలో బంగ్లాదేశ్ లో హిందువులు ఎందుకు చంపబడుతున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్కడ సామూహిక హిందూ మారణహోమం జరగడాన్ని చూస్తుంటే ఇది రాజకీయ నిరసన అని అనిపించడం లేదని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశ్తున్నారు.

బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి అలా ఉంటే... అక్కడున్న భారతీయుల పరిస్థితి ఏమిటనేది చర్చకు వచ్చింది. ఈ సమయంలో అక్కడి పరిణామాల గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన అన్ని పార్టీల నేతలకు పరిస్థితి వివరించారు. బంగ్లాలో ఉన్న భారతీయులను తరలించేటంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని తెలిపారు.

మరోవైపు బంగ్లాలో నెలకొన్న కల్లోల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. సరిహద్దు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు మేఘాలయలోని ఇంటర్నేషనల్ బోర్డర్ వెంబడి నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇదే సమయంలో... బంగ్లాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేయవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వాటిని వ్యాప్తి చేస్తే రాష్ట్రంలో అశాంతి రగిలే ప్రమాదం ఉందని హెచ్చరించింది.