Begin typing your search above and press return to search.

హసీనాపై ఉచ్చు.. కిరాణా వ్యాపారి హత్యపై కేసు.. బెంగాలీలో స్పందన

హసీనాపై కొత్త ప్రభుత్వం ఓ కేసు నమోదు చేసింది. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో ఒక కిరాణా దుకాణ యజమాని ప్రాణాలు కోల్పోయాడు.

By:  Tupaki Desk   |   14 Aug 2024 7:08 AM GMT
హసీనాపై ఉచ్చు.. కిరాణా వ్యాపారి హత్యపై కేసు.. బెంగాలీలో స్పందన
X

సరిగ్గా పది రోజులైంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి.. అప్పటినుంచి ఆమె భారత్ లోనే ఉంటున్నారు. బంగ్లాను వీడేప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నం చేసినా అందుకు అనుమతి లభించలేదు. దీంతో ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లోనే ఉంటున్నారు హసీనా. మరోవైపు ఆ దేశంలో అల్లర్లు సద్దుమణిగి.. నోబెల్ బహుమతి గ్రహీత యూనుస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీంతోపాటు మధ్యలో హసీనా నేరుగా మాట్లాడకున్నా.. తిరిగి బంగ్లాదేశ్ వెళ్తాననే సంకేతాలు ఇచ్చారు. ఇదంతా పక్కనపెడితే యూనుస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక హసీనాను దారుణంగా విమర్శించారు. ఆమెను ‘రాక్షసి’ అని అభివర్ణించారు. దీన్నిబట్టే ఆయన ఎలాంటి ఉద్దేశంలో ఉన్నారో తెలిసిపోతుంది. మరోవైపు హసీనాకు బద్ధ శత్రువు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత్రి, మాజీ ప్రధాని ఖలీదా జియాను జైలు నుంచి విడిపించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాన్నాయి. కాగా, హసీనాను మళ్లీ సొంతగడ్డపై కాలుపెట్టే పరిస్థితి లేకుండా చేసే పని కూడా మొదలైంది.

ఎక్కడ ప్రధాని.. ఎక్కడ కిరాణా యజమాని?

హసీనాపై కొత్త ప్రభుత్వం ఓ కేసు నమోదు చేసింది. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లలో ఒక కిరాణా దుకాణ యజమాని ప్రాణాలు కోల్పోయాడు. ఇది గత నెలలో జరిగిన ఘటన. దీనిపై హసీనాను బాధ్యురాలిని చేసింది యూనుస్ ప్రభుత్వం. హసీనాతో పాటు ఏడుగురి పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఆమె ప్రభుత్వంలోని మంత్రులు ఇద్దరు, పదవీచ్యుతుడైన పోలీస్ ఐజీ, మరో ముగ్గురు పోలీసులు ఉండడం గమనార్హం.

ఇదే మొదటి కేసు.. చివరిది మాత్రం కాదు..

హసీనాపై నమోదైన మొదటి కేసు ఇదే అయినప్పటికీ.. చివరిది మాత్రం కాదని చెప్పవచ్చు. కాగా, (మాజీ) ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తిపై.. కిరాణం దుకాణం యజమాని హత్య కేసు పెట్టడం బట్టి చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో తెలుస్తోంది. ఇక హసీనా తండ్రి, వంగబంధు ముజిబుర్‌ రహ్మాన్‌ హత్యకు గురైన ఆగస్టు 15ను ఇప్పటివరకు జాతీయ సెలవుదినంగా జరుపుకొంటున్నారు. కొత్త ప్రభుత్వం దానిని రద్దు చేయడం గమనార్హం.

మరోవైపు హసీనాపై కేసు నమోదు అనంతరం ఫ్రాన్స్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి.. ఫిర్యాదుదారు అంతు చూస్తామని హెచ్చరించడం గమనార్హం. మరోవైపు దేశంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు, వైదొలగాక జరిగిన దాడులు, దౌర్జన్యం, ప్రాణ నష్టంలొ బాధితులను ఆదుకోవాలని హసీనా కోరుతున్నారు. బాధ్యులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.

నోరిప్పిన హసీనా..

పదవి కోల్పోయిన తర్వాత హసీనా తొలిసారి మంగళవారం బెంగాలీలో ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిని ఆమె కుమారుడు సజీబ్‌ వాజెద్‌ ట్వీట్ చేశారు. గత నెలలో మొదలైన ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు, జర్నలిస్టులు, అవామీ లీగ్‌ ఉద్యమకర్తలు, ప్రజలు చనిపోవడంపై హసీనా ఆవేదన వ్యక్తంచేశారు. 1975 ఆగస్టు 15న తన తల్లిదండ్రలు, ముగ్గురు సోదరుల హత్యతో తానెంత బాధపడినదో వివరించారు. అలాంటి బాధలోనే ఉన్నవారందరికీ న్యాయం జరిగేలా విచారణ జరగాలని చెప్పారు.