Begin typing your search above and press return to search.

రేవ్‌ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు!

బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

By:  Tupaki Desk   |   21 May 2024 7:39 AM GMT
రేవ్‌ పార్టీ.. వెలుగులోకి సంచలన విషయాలు!
X

బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో 150 మందికి పైగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, కన్నడ, తమిళ సినీ నటులు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో పలువురు నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయనేతలు ఉన్నారని టాక్‌ నడుస్తోంది. వీరంతా రెండు రోజులపాటు ఫామ్‌ హౌస్‌ లోనే ఉన్నారని చెబుతున్నారు.

ఇప్పటికే తాము ఈ రేవ్‌ పార్టీలో లేమని ప్రముఖ నటులు శ్రీకాంత్, హేమ, డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ మాస్టర్‌ వెల్లడించారు. పోలీసులు మాత్రం హేమ ఉందని అంటున్నారు.

కాగా బెంగళూరు శివార్లలో హైదరాబాద్‌ కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందిన జీఆర్‌ ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇందులో పాల్గొన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

డాగ్‌ స్క్వాడ్‌ తో తనిఖీలు చేపట్టగా సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్‌ లభించాయని పోలీసులు తెలిపారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసును కర్ణాటక పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

హైదరాబాద్‌ లో పోలీసుల తనిఖీలు ఎక్కువగా ఉండటం, డ్రగ్స్, రేవ్‌ పార్టీలపై పోలీసులు ఎక్కువ దృష్టి సారించడంతోనే పార్టీకి బెంగళూరును ఎంపిక చేసుకున్నారని.. అది కూడా ఆ నగర శివార్లలో ఉన్న ఫామ్‌ హౌస్‌ ను ఎంపిక చేసుకున్నారని చెబుతున్నారు.

‘సన్‌సెట్‌ టూ సన్‌ రైజ్‌ విక్టరీ’ పేరుతో ఒక వ్యాపారి తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇచ్చినట్టు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలని ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బర్త్‌ డే పార్టీ పేరిట రేవ్‌ పార్టీ జరిగిందని.. ఇందులో డ్రగ్స్‌ వినియోగించినట్టు సమాచారం.

రేవ్‌ పార్టీ బాధ్యతలను అరుణ్‌ అనే వ్యక్తి నిర్వహించినట్టు తెలుస్తోంది. వాసు బర్త్‌ డే పార్టీకి డ్రగ్‌ పెడ్లర్లు సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌ కూడా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో రేవ్‌ పార్టీ ఇచ్చిన వాసు గురించి పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. డ్రగ్‌ ప్లెడ్లర్‌ లతో అతడికి ఉన్న సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అతడిపై ఉన్న పాత కేసుల వివరాలను కూడా తెలుసుకుంటున్నారు.

కాగా రేవ్‌ పార్టీకి సంబంధించి ఇప్పటికే వాసు, అరుణ్, సిద్ధిఖీ, రణధీర్, రాజ్‌ లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకుని.. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.