అకౌంట్ లో రూ.7వేల లక్షల కోట్లు... గంటన్నర కుబేరుడి గురించి తెలుసా?
తాజాగా ఓ బ్యాంక్ చేసిన పొరపాటు ఓ వ్యక్తి జీవితంలో ఒక్కసారిగా ఆశలు రేపింది! ఊహించని స్థాయిలో.
By: Tupaki Desk | 1 March 2025 7:30 AM GMTతాజాగా ఓ బ్యాంక్ చేసిన పొరపాటు ఓ వ్యక్తి జీవితంలో ఒక్కసారిగా ఆశలు రేపింది! ఊహించని స్థాయిలో. వేల రూపాయలు జమ కావాల్సిన చోట వేల లక్షల కోట్లు జమ చేసింది. దీంతో సదరు ఖాతాదారుడు క్షణాల్లో బిలియనీర్ గా మారిపోయాడు.. కాకపోతే ఆ హోదా గంటన్నర (90 నిమిషాలు) మాత్రమే ఉండటం గమనార్హం.
అవును... 280 డాలర్లు (దాదాపు రూ.24,500) జమ చేయాల్సిన బ్యాంక్ ఖాతాలో ఏకంగా 81 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.7,081 లక్షల కోట్లు) జమ చేసింది ఓ బ్యాంక్. దీంతో.. ఆ అకౌంట్ హోల్డర్ ఒక్కసారిగా కుబేరుడైపోయాడు. అయితే అతడి హోదా గంటన్నరలోనే మటుమాయమైపోయింది. ఈ ఘటన అమెరికాలోని సిటీ బ్యాంక్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని సిటీగ్రూపు ఇన్ కార్పొరేషన్ కు చెందిన సిటీ బ్యాంకు సిబ్బంది గత ఏడాది ఏప్రిల్ లో ఒక పొరపాటు చేసింది. ఇందులో భాగంగా... ఒక కస్టమర్ బ్యాంక్ అకౌంట్ లో $280కి బదులుగా పొరపాటున $81 ట్రిలియన్లు జమ చేసింది. అయితే... ఈ తప్పును సదరు ఉద్యోగులు గుర్తించలేకపోయారు.
అయితే... ఈ వ్యవహారాన్ని మరో ఉద్యోగి సుమారు 90 నిమిషాల తర్వాత గుర్తించారు. దీంతో.. అధికారులు అప్రమత్తమై సదరు లావాదేవీని "రివర్స్" చేశారు. ఫలితంగా... బ్యాంక్ సొమ్ము తిరిగి భద్రంగా వెనక్కి వచ్చేసింది. దీంతో.. ఉద్యోగులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారని అంటున్నారు.
కాగా... లావాదేవీ వైఫల్యాలు, అంటే.. అకౌంట్ లో ఎక్కువ / తక్కువ సొమ్మును పొరపాటున జమ చేయడాన్ని బ్యాంకింగ్ పరిభాషలో "నియర్ మిస్" అంటారని అంటున్నారు. ఈ సమయంలో హెచ్చరించేందుకు డిటెక్టివ్ కంట్రోల్ వ్యవస్థ బ్యాంకుల్లో ఉంటుంది. ఈ క్రమంలో 2024లో సిటీ బ్యాంక్ లో 1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ 10 నియర్ మిస్ లు చోటు చేసుకున్నాయని అంటున్నారు.
వీటిలో ఒకటే గత ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఈ రూ.7,081 లక్షల కోట్ల లావాదేవీ అని అంటున్నారు. అయితే.. ఈ విషయాన్ని డిటెక్టివ్ కంట్రోల్ వ్యవస్థ కనిపెట్టినట్లు బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు.