బ్యాంకుకు భారీ మోసం.. రూ.వేల కోట్లు ముంచేశారు
చిన్న విషయాలకు సైతం సామాన్యులకు చుక్కలు చూపించే బ్యాంకులు.. ఘరానా మోసగాళ్లకు మాత్రంరూ.వేల కోట్లు సమర్పించేసుకుంటాయి
By: Tupaki Desk | 19 Sep 2023 4:17 AM GMTచిన్న విషయాలకు సైతం సామాన్యులకు చుక్కలు చూపించే బ్యాంకులు.. ఘరానా మోసగాళ్లకు మాత్రంరూ.వేల కోట్లు సమర్పించేసుకుంటాయి. తాజాగా అలాంటి బ్యాంకు స్కాం బయటకు వచ్చింది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన బ్యాంకుల కన్సార్టియంలో వేల కోట్లకు జరిగిన మోసం తాజాగా బయటకు వచ్చింది. ముంబయికి చెందిన ప్రముఖ డెవలపర్ ''యూనిటీ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్'' పై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ రియాల్టీ సంస్థ గురించి చెప్పుకోవాలంటే.. 2012లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మంత్రాలయ బిల్డింగ్ ను పునరుద్దరించే ప్రాజెక్టు కావొచ్చు.. థాకరే కుటుంబానికి చెందిన మాతోశ్రీ నిర్మాణం కావొచ్చు.. దాదార్ టీటీ ఫ్లైఓవర్ కానీ సీఎస్ఎం సబ్వే లాంటి పేరున్న నిర్మాణాల్ని ఈ సంస్థే పూర్తి చేసింది. అలాంటి రియాల్టీ సంస్థ తాజాగా భారీ మోసానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది.
ఈ రియాల్టీ సంస్థ ఎస్ బీఐ కన్సార్టియంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.3847.5 కోట్ల మేర మోసం చేశారని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ఆరోపణల మీద సదరు రియాల్టీ సంస్థకు చెందిన సీఎండీ కిషోర్ క్రిష్ణ.. ప్రమోటర్లు అభిజీత్ కిషోర్ అవర్ సేకర్.. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశిష్ తదితరులపై అభియోగాల్నినమోదు చేసింది. పలువురు బ్యాంకు ఉద్యోగులపైనా కేసులు నమోదు అయ్యాయి. నిందితులు కల్పిత లావాదేవీల్ని చేయటం.. బ్యాంకులను మోసం చేయటం.. చట్టవిరుద్ధంగా.. మోసపూరితంగా ఖాతా పుస్తకాల్ని తారుమారు చేసి వేలాది కోట్లు బ్యాంకులకు నష్టం వాటిల్లేలా చేశారు. ముంబయికి చెందిన ఎస్ బీఐ డీజీఎం రజనీకాంత్ ఠాకూర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కాం బయటకు వచ్చింది.